ఫ్లిప్‌కార్ట్‌లో 70వేల ఉద్యోగాలు 

16 Sep, 2020 08:25 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రముఖ రీటైల్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ భారీగా సీజనల్‌ ఉద్యోగ నియామకాలకు తెరతీసింది. పండుగ సీజన్‌తో పాటు తన బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్స్‌ ఆఫర్‌ రోజుల సందర్భంగా నెలకొనే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా 70వేల ప్రత్యక్ష, లక్షలాది పరోక్ష ఉద్యోగ అవకాశాల్ని కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందులో ప్రత్యక్ష నియామకాల్ని తన సప్లై చెయిన్‌లో ఎగ్జిక్యూటివ్స్, పిక్కర్స్, ప్యాకర్స్, సార్టర్స్‌ పోస్టుల్లో భర్తీ చేయనుండగా, పరోక్ష ఉద్యోగ అవకాశాల్ని తన అమ్మకపు భాగస్వామ్య లొకేషన్లు, కిరాణషాపుల్లో కల్పించనుంది.

సప్లయి చైన్‌ విస్తరణ, బలోపేతంతో రానున్న పండుగల సీజన్‌లో లక్షల మంది ఈ–కామర్స్‌ కస్టమర్లు ఆన్‌లైన్‌లో సాఫీగా షాపింగ్‌ చేసుకునే సౌకర్యాన్ని కలి్పంచేందుకు ఈ భారీ నియామకాలను చేపట్టినట్లు కంపెనీ తెలిపింది. కొత్తగా ఎంపికైన వారికి కస్టమర్‌ సర్వీస్, డెలివరీ, ఇన్‌స్టాలేషన్, సేఫ్టీ, శానిటైజేషన్‌తో పాటు పీఓఎస్‌ మెషీన్లు, స్కానర్లు, మొబైల్‌ అప్లికేషన్లను ఆపరేట్‌ చేయడం తదితర అంశాల్లో శిక్షణ ఇస్తామని కంపెనీ పేర్కొంది. ‘‘ఈ–కామర్స్‌ వ్యవస్థ పురోగతికి అదనపు అవకాశాల సృష్టి అవసరం. ఇది కేవలం పరిశ్రమకు పరిమితం కాకుండా కస్టమర్ల ప్రయోజనాలకు ముఖ్యమే.’’ అని ఫ్లిప్‌కార్ట్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అమితేష్‌ ఝా అన్నారు.

ఆర్డర్లను చివరి మైలురాయి వరకు చేర్చేందుకు దేశంలో 50 వేల చిన్న కిరాణాషాపులు, పెద్ద హోల్‌సేల్‌ దుకాణాలతో ఫ్లిప్‌కార్ట్‌ గతవారం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ కామర్స్‌ కంపెనీలు పండుగ సీజన్‌లో వచ్చే ఆర్డర్ల దృష్ట్యా భారీగా ఉద్యోగ సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. గతేడాదిలో ఇదే పండుగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ కంపెనీలు దాదాపు 1.4లక్షల తాత్కాలిక ఉద్యోగాలను నియమించుకున్నాయి. ఇక ఇప్పటికే లాజిస్టిక్స్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ ఈ–కామ్‌ ఎక్స్‌ప్రెస్‌ 30,000 ఉద్యోగాలను ప్రకటించింది. 

మరిన్ని వార్తలు