టీఎస్‌ రెరాలో 3,630; ఏపీ రెరాలో 2,049

4 Dec, 2021 05:04 IST|Sakshi

ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో నమోదైన ప్రాజెక్ట్‌లివీ..

సాక్షి, సిటీబ్యూరో:  రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ చట్టం (రెరా) అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఈ ఏడాది నవంబర్‌ 20 వరకు ఆంధ్రప్రదేశ్‌ రెరాలో 2,049 ప్రాజెక్ట్‌లు, 149 మంది ఏజెంట్లు నమోదయ్యారు. ఇప్పటివరకు 158 ఫిర్యాదులను ఏపీ రెరా పరిష్కరించింది. అలాగే తెలంగాణ రెరాలో 3,630 ప్రాజెక్ట్‌లు, 1,891 ఏజెంట్లు రిజిస్టర్‌ కాగా.. ఒక్క ఫిర్యాదు కూడా పరిష్కరించలేదు.

దేశంలో రెరా అమల్లోకి వచ్చిన నాలుగున్నర ఏళ్లలో 71,307 ప్రాజెక్ట్‌లు, దేశవ్యాప్తంగా 56,177 మంది ఏజెంట్లు నమోదయ్యారని గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రెరాలో అత్యధికంగా ప్రాజెక్ట్‌లు రిజిస్టరయ్యాయి. 2019 నుంచి ఈ ఏడాది నవంబర్‌ వరకు మహారాష్ట్రలో 31,664, గుజరాత్‌లో 9,272, కర్ణాటక రెరాలో 4,497 ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి.

గత రెండేళ్లలో ఆయా రాష్ట్రాల రెరాలో ప్రాజెక్ట్‌ రిజిస్ట్రేషన్లలో 49 శాతం, ఫిర్యాదుల పరిష్కారంలో 128 శాతం వృద్ధి నమోదయింది. ఇప్పటివరకు అన్ని రాష్ట్రాల రెరా అథారిటీలు 78,903 ఫిర్యాదులను పరిష్కరించాయి. రెరాకు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంలో ఉత్తరప్రదేశ్, హరియాణా ప్రభుత్వాలు ముందంజలో ఉన్నాయి. యూపీలో 30,990 కేసులు, హర్యానాలో 16,864 కేసులు పరిష్కారమయ్యాయి.

ఇదీ రెరా పరిస్థితి..
నాగాలాండ్‌ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రెరా నిబంధనలను నోటిఫై చేశాయి. 30 రాష్ట్రాలు, యూటీలు రెరా అథారిటీని ఏర్పాటు చేశాయి. ఇందులో 25 రెగ్యులర్‌ అథారిటీ కాగా, 5 మధ్యంతర అథారిటీలున్నాయి. జమ్మూ అండ్‌ కశ్మీర్, లడక్, మేఘాలయ, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు రెరా నిబంధనలను నోటిఫై చేశాయి కానీ అథారిటీలను ఏర్పాటు చేయలేదు. కాగా 28 రాష్ట్రాలు, యూటీలు రియల్‌ ఎస్టేట్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశాయి. అరుణాచల్‌ ప్రదేశ్, జమ్మూ అండ్‌ కశ్మీర్, లడక్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లు ట్రిబ్యునల్‌ ఏర్పాటు ప్రక్రియలో ఉన్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్, అస్సాం, మణిపూర్‌ మినహా అన్ని రాష్ట్రాలు రెరా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లూ రెరాలోకి..
సుప్రీంకోర్టు రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ చట్టం–2016 పరిధిని విస్తృతం చేసింది. అన్ని రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌లు రెరా పరిధిలోకి వచ్చే వరకూ కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ పొందలేరని వ్యాఖ్యానించింది. అంటే నిర్మాణం లో ఉన్న ప్రాజెక్ట్‌లను రెరా పరిధిలోకి చేర్చకుండా రెరా నిబంధనలను బలహీనపరిచిన రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి ప్రాజెక్ట్‌లను రెరా పరిధిలోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రెరా జరిమానా విధించిన డెవలపర్లు అప్పీల్‌కు వెళ్లినా సరే.. జరిమానా మొత్తం లో  25 శాతం రెరా వద్ద డిపాజిట్‌ చేయాలి.

నిలిచిపోయిన ప్రాజెక్ట్‌లు పూర్తవుతాయి..
సుప్రీం ఆదేశాల మేరకు నిర్మాణంలోని ప్రాజెక్ట్‌ లు రెరా పరిధిలోకి వస్తే వచ్చే రెండేళ్లలో గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లు మరింత వేగంగా పూర్తవుతా యని అనరాక్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనూజ్‌ పూరీ తెలిపారు. ఇప్పటికే చాలా మంది డెవలపర్లు రెరా పరిధిలోకి రాని నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంపై దృష్టిసారించారన్నారు. దీంతో కొన్నేళ్లుగా నిర్మాణం జరుగుతున్న, మధ్యలో నిలిచిపోయిన గృహాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశముందని తెలిపారు. ఈ ఏడాది జూలై నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2014, అంతకంటే ముందు ప్రారంభమై ఇప్ప టికీ పూర్తి కాకుండా 6.29 లక్షల గృహాలున్నాయి.

>
మరిన్ని వార్తలు