టెక్‌ ఇండియా... 75 ఏళ్లలో సాధించిన పురోగతి ఇదే

15 Aug, 2021 14:45 IST|Sakshi

Technology Achievements Of India: 1947 నుంచి ఇప్పటివరకూ ఒక దేశంగా మనం సాధించిన ఘన విజయాలను ఒక్కసారి నెమరేసుకుంటే.. విస్పష్టంగా అందరికీ కనిపించేవి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో సాధించిన ప్రగతే. సామాన్యుల బతుకులపైనా ప్రభావం చూపిన ఆవిష్కరణలు, పరిశోధనలు కోకొల్లలు. అంగారకుడిపైకి చౌకగా నౌకను పంపామని... ఏకకాలంలో 104 ఉపగ్రహాలను ప్రయోగించడంలో విజయం సాధించామన్నది ఎంత నిజమో... దిగుమతులపై ఆధారపడిన దశ నుంచి కావాల్సినంత పండించుకుని తినడమే కాకుండా... ఎగుమతులూ చేస్తున్న ఆహార, పాడి సమృద్ధి కూడా అంతే వాస్తవం.

అనుకూలమైన విధానాలూ తోడవడంతో ఆహారం, పాలు, పండ్లు, కాయగూరలు, వ్యాక్సిన్లు, మందుల తయారీలో ఇంకొకరిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. రక్షణ రంగంలోనూ సొంతంగా మన కాళ్లపై మనం నిలబడగలిగే స్థాయికి భారత్‌ ఎదిగింది. ఎదుగుతోంది కూడా. 1947లో స్థూల జాతీయోత్పత్తిలో శాస్త్ర పరిశోధనలకు కేటాయించింది 0.1 శాతం మాత్రమే అయినప్పటికీ గత దశాబ్ద కాలంలో ఇది ఒక శాతానికి కొంచెం దిగువన మాత్రమే ఉండటం కొంత ఆందోళన కలిగించే అంశం. మొత్తమ్మీద శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో స్వాతంత్య్రానంతరం మనం సాధించిన ఘన విజయాలను స్థూలంగా తరచి చూస్తే...

హరిత విప్లవం...
1947లో దేశం పండించిన గోధుమలు కేవలం 60 లక్షల టన్నులు. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి లేని నేపథ్యంలో అప్పట్లో అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. అయితే భూ సంస్కరణలతోపాటు భాక్రా–నంగల్, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టడంతో పరిస్థితిలో మార్పులు మొదలయ్యాయి. సొంతంగా ఎరువుల ఉత్పత్తి కూడా చేపట్టడం, వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఫలితంగా 1964 నాటికి గోధుమల ఉత్పత్తి రెట్టింపు అయ్యింది. అయినప్పటికీ దేశీయ అవసరాలకు సరిపోని పరిస్థితి.

మెరుగైన వంగడాలను అభివృద్ధి చేసేందుకు భారత వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త బెంజిమన్‌ పియరీ పాల్‌ చేపట్టిన పరిశోధనలు 1961లో ఫలప్రదమవడంతో గోధుమ దిగుబడులు గణనీయంగా పెరిగాయి. చీడపీడల బెడద కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో అధిక దిగుబడులిచ్చే వంగడాల అభివృద్ధే లక్ష్యంగా హరిత విప్లవం మొదలైంది. గోధుమతోపాటు, వరి, మొక్కజొన్న, జొన్న వంటి పంటల్లో కొత్త వంగడాలు వృద్ధి చేయడం మొదలైంది. 1947లో బెల్‌ ల్యాబ్స్‌ తొలి ట్రాన్సిస్టర్‌ను తయారు చేయగా.. అప్పట్లో దాన్ని మనుషులు చేతులతో తయారు చేసే పరిస్థితి ఉండేది. ఈనాటి ట్రాన్సిస్టర్‌ సైజు ఎంతుంటుందో తెలుసా? సూదిమొనపై చాలా సులువుగా పదికోట్ల ట్రాన్సిస్టర్లను పెట్టేయవచ్చు. ఎంఎస్‌ స్వామినాథన్‌ వంటి శాస్త్రవేత్తలు తమదైన సహకారం అందించారు.

చదవండి : మస్తు ఫీచర్లతో మడత ఫోన్లు..ఇరగదీస్తున్నాయిగా

క్షీర విప్లవం...
స్వాతంత్య్రం వచ్చేనాటికి ఆహారంతోపాటు పాల ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. పసిపిల్లలకు వాడే పాల ఉత్పత్తులు, వెన్న, చీజ్‌ వంటివి దిగుమతయ్యేవి. 1955లో భారత్‌ యూరప్‌ నుంచి మొత్తం 500 టన్నుల వెన్న, మూడు వేల టన్నుల పిల్లల ఆహారాన్ని దిగుమతి చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గుజరాత్‌లో కైరా డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ యూనియన్‌ లిమిటెడ్‌ ప్రారంభంతో ఈ పరిస్థితిలో మార్పులు మొదలయ్యాయి. స్వాతంత్య్రానికి ఏడాది ముందు ఈ సంస్థ త్రిభువన్‌ దాస్‌ పటేల్‌ నేతృత్వంలో ప్రారంభమైంది.

1949లో తన పై చదువులకు సహకరించిన ప్రభుత్వానికి ఇచ్చిన మాటకు అనుగుణంగా వర్ఘీస్‌ కురియన్‌ గుజరాత్‌లోని ఆనంద్‌కు రావడం, అమూల్‌ ప్రారంభంతో దేశంలో క్షీర విప్లవం మొదలైంది. తొలినాళ్లలో అమూల్‌ సేకరించే పాల సరఫరా విషయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. పాలపొడి తయారీ టెక్నాలజీ అప్పట్లో యూరోపియన్‌ దేశాల్లో మాత్రమే ఉండేది. పైగా వాళ్లేమో బర్రెపాలను పొడిగా మార్చలేమని చెప్పేవారు. కానీ.. కురియన్‌తో పాటు అమూల్‌లో పనిచేసిన హెచ్‌.ఎం.దహియా అనే యువ డెయిరీ ఇంజినీర్‌ ప్రయోగాలు చేపట్టి బర్రెపాలను పొడిగా మార్చవచ్చునని నిరూపించారు. ప్రపంచంలోనే ఇది తొలిసారి కావడం చెప్పుకోవాల్సిన విషయం. పెయింట్‌ పిచికారి చేసే యంత్రం, గాలిని వేడి చేసే యంత్రాల సాయంతో తయారైన ఈ టెక్నాలజీ కాస్తా దేశంలో పాల దిగుబడి అవసరానికి మించి పెరిగేలా చేసింది. ఎంతలా అంటే... ప్రపంచమంతా కోవిడ్‌–19తో సతమతమవుతున్న సమయంలో భారత్‌ ఏకంగా 550 కోట్ల రూపాయల విలువ చేసే పాల ఉత్పత్తులను ఎగుమతి చేసేంత! 

చదవండి :  సిరులిచ్చే.. సోయగాల చేపలు!

ఉపగ్రహాలు, సమాచార విప్లవం...
1960లలో ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ ఛైర్మన్‌గా విక్రమ్‌ సారాభాయ్‌ సమాచార ప్రసారాలు, రిమోట్‌ సెన్సింగ్, వాతావరణ అంచనాల కోసం ఉపగ్రహ టెక్నాలజీని వాడుకోవాలని అంటూంటే.. ఆయన్ను నమ్మేవారు చాలా తక్కుమంది మాత్రమే ఉండేవారు. సొంతంగా రాకెట్లు తయారు చేసే జ్ఞానమెక్కడిదని చాలామంది విమర్శించేవారు కూడా. విక్రమ్‌ సారాభాయ్‌ ఉపగ్రహాల సాయంతో దేశంలో విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి రంగాల్లో వృద్ధి సాధించాలని కలలు కనేవాడు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్థాపనతో ఈ కలల సాకారం మొదలైంది.

దశాబ్దకాలంలోనే దేశం సొంతంగా రాకెట్‌ను తయారు చేయడంతోపాటు అంతరిక్ష ప్రయోగాలను శాంతి కోసం వాడుకోవచ్చునని నిరూపించారు. ఆర్యభట్ట ఉపగ్రహం సాయంతో శాటిలైట్‌ ఇన్‌స్ట్రక్షనల్‌ టెలివిజన్‌ ఎక్స్‌పెరిమెంట్‌ను విజయవంతంగా పూర్తి చేయడంతో అంతరిక్ష రంగంలో భారత్‌ తన ముద్రను వేయడం మొదలుపెట్టింది. తరువాతి కాలంలో ఇన్‌శాట్, ఐఆర్‌ఎస్‌ శ్రేణి ఉపగ్రహాల ప్రయోగాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఆఖరుకు చంద్రయాన్‌ –1తో జాబిల్లిపై నీటి ఛాయలను నిర్ధారించగలగడంతోపాటు తొలి ప్రయత్నంలోనే అంగారకుడిని అందుకున్న దేశంగానూ రికార్డు స్థాపించింది. హాలీవుడ్‌ సినిమా కంటే తక్కువ బడ్జెట్‌తో అంగారకుడిపైకి మంగళ్‌యాన్‌ ఉపగ్రహాన్ని పంపించడం వెనుక ఉన్న భారతీయ శాస్త్రవేత్తల మేధకు ప్రపంచం జేజేలు కొట్టింది. వీశాట్‌ టెక్నాలజీ వాడకం ద్వారా 1980లలో బ్యాంకింగ్‌ సేవలు దేశం మూలమూలలకు చేరుకుంది. ఉపగ్రహాల సాయంతో తుపానులను ముందుగా గుర్తించడం వీలు కావడంతో వేలాది ప్రాణాలను రక్షించగలుగుతున్నాం.

ఫార్మా, వ్యాక్సిన్‌ తయారీల్లో...
మీకు తెలుసా... ప్రపంచం మొత్తమ్మీద వేసే ప్రతి వ్యాక్సిన్‌లో మూడో వంతు భారత్‌లోనే తయారవుతున్నాయని వ్యాక్సిన్లు మాత్రమే కాదు.. ఫార్మా రంగంలోనూ భారత్‌ సాధించిన ప్రగతి కచ్చితంగా ఎన్నదగ్గదే. జెనెరిక్‌ మందుల తయారీతో పేద దేశాల్లో హెచ్‌ఐవీ వంటి ప్రాణాంతక వ్యాధులకు బలవుతున్న లక్షలాది ప్రాణాలను కాపాడగలగడం ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. మేధాహక్కుల పేరుతో విపరీతమైన లాభాలను గడించే ఫార్మా కంపెనీల ఆటలకు అడ్డుకట్ట పడిందిలా. విదేశీ ఫార్మా కంపెనీల దోపిడీకి చెక్‌ పెట్టే లక్ష్యంతో భారత ప్రభుత్వం 1954లో హిందుస్థాన్‌ యాంటీబయాటిక్స్‌ను ప్రారంభించింది.

ఆ వెంటనే సోవియెట్‌ యూనియన్‌ సాయంతో హైదరాబాద్‌లో ఇండియన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ (ఐడీపీఎల్‌) ఏర్పాటు జరిగింది. నేషనల్‌ కెమికల్స్‌ లాబొరేటరీ, రీజనల్‌ రీసెర్చ్‌ లాబొరేటరీ (తరువాతి కాలంలో దీని పేరును ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీగా మార్చారు), సెంట్రల్‌ డ్రగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వంటి ప్రభుత్వ సంస్థలు తమ వంతు పాత్ర పోషించడంతో అనతి కాలంలోనే అటు వ్యవసాయానికి సంబంధించిన ఎరువుల తయారీ మొదలుకొని ఇటు మందుల తయారీలోనూ ప్రపంచ గుర్తింపు పొందే స్థాయికి ఎదగగలిగాం. 1970లో పేటెంట్‌ హక్కుల్లో మార్పులు రావడంతో దేశంలో జెనెరిక్‌ మందుల వెల్లువ మొదలైంది. సిప్రోఫ్లాక్సిన్, డైక్లోఫెనాక్, సాల్‌బుటమాల్, ఒమిప్రొజోల్, అజిత్రోమైసిన్‌ వంటి మందులను భిన్నమైన పద్ధతిలో తయారు చేసి పెటెంట్‌ రాయల్టీల చెల్లింపుల సమస్యను అధిగమించగలిగారు. 

సి–డాట్‌తో టెలికామ్‌ రంగంలో పెనుమార్పులు...
స్వాతంత్య్రం వచ్చే సమయానికి అనేక ఇతర రంగాల మాదిరిగానే టెలికామ్‌ రంగంలోనూ విదేశీ కంపెనీల హవా నడుస్తూండేది. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు తక్కువగా ఉండటం.. విదేశీ కంపెనీలేమో విపరీతమైన ధరలను వసూలు చేస్తున్న నేపథ్యంలో టెలికామ్‌ రంగంలోనూ స్వావలంబనకు ఆలోచనలు మొదలయ్యాయి. 1970లలో ఒక ఫోన్‌ కనెక్షన్‌ కావాలంటే ఎంత కాలం వేచి ఉండాల్సి వచ్చేదో కొంతమందికి అనుభవమే. గ్రామీణ ప్రాంతాల్లో సమాచార వ్యవస్థలు అస్సలు ఉండేవే కావు. ఈ నేపథ్యంలో 1960లలో  టెలికామ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటైంది.

పూర్తి స్వదేశీ టెక్నాలజీతోనే టెలిఫోన్‌ ఎక్సే్ఛంజీని ఏర్పాటు చేసే ప్రయత్నానికి శ్రీకారం పడింది. 1973లో వంద లైన్లతో తొలి ఎలక్ట్రానిక్‌ స్విచ్‌ తయారవడంతో టెలికామ్‌ రంగంలో దేశీ ముద్రకు బీజం పడినట్లు అయ్యింది. అదే సమయంలో టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్, ఐఐటీ బాంబేలు మిలటరీ అవసరాల కోసం డిజిటల్‌ ఆటోమెటిక్‌ ఎలక్ట్రానిక్‌ స్విచ్‌లను అభివృద్ధి చేశాయి. 1984లో శ్యామ్‌ పిట్రోడా నేతృత్వంలో సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలిమ్యాటిక్స్‌ (సీ–డాట్‌) ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల్లోనూ సొంత టెలిఫోన్‌ ఎక్సే్ఛంజీల నిర్మాణం మొదలైంది. ఈ టెక్నాలజీని ప్రైవేట్‌ రంగానికి ఉచితంగా మళ్లించడంతో మల్టీనేషనల్‌ కంపెనీల గుత్తాధిపత్యానికి తెరపడింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ సమాచార వ్యవస్థలు ఏర్పడటం మొదలైంది. ఏసీల అవసరం లేకుండా.. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేయగల భారతీయ టెలిఫోన్‌ ఎక్సే్ఛంజ్‌ టెక్నాలజీ సీ–డాట్‌ అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకూ సాయపడటం కొసమెరుపు!

రైల్వేల కంప్యూటరీకరణ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ...
ఐబీఎం, ఐసీఎల్‌... స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో డేటా ప్రాసెసింగ్‌ పరిశ్రమలో ఆధిపత్యం చలాయించిన రెండు కంపెనీలు ఇవి. రెండూ విదేశీ బహుళజాతి కంపెనీలే. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలతోపాటు రక్షణ, పరిశోధన సంస్థల్లోనూ ఈ కంపెనీలు తయారు చేసిన డేటా ప్రాసెసింగ్‌ యంత్రాలనే వాడేవారు. విదేశాల్లో వాడిపడేసిన యంత్రాలను భారత్‌కు తెచ్చి అధిక ధరలకు లీజ్‌కు ఇచ్చేవి ఈ కంపెనీలు.

నేషనల్‌ శాంపిల్‌ సర్వే, అణురియాక్టర్‌ తయారీ వంటి ప్రాజెక్టుల కోసం ఈ డేటా ప్రాసెసింగ్‌ యంత్రాల అవసరమైతే భారత్‌కు ఎంతో ఉండేది. ఈ అవసరాన్ని ఐబీఎం, ఐసీఎల్‌లు రెండూ తమకు అనుకూలంగా మలచుకున్నాయి. ఈ నేపథ్యంలో వీరి గుత్తాధిపత్యానికి తెరవేసే ప్రయత్నంలో భాగంగా హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్లను సొంతంగా తయారు చేసుకోవాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. 1970లలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌తోపాటు ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌), కంప్యూటర్‌ మెయింటెనెన్స్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ)లను స్థాపించింది. ఈ సంస్థల ద్వారా జరిపిన ప్రాథమిక పరిశోధనల ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత సమర్థమైన రైల్వే రిజర్వేషన్‌ ప్రాజెక్టు 1986కల్లా అందుబాటులోకి వచ్చింది.

ఇవి మాత్రమే కాదు.. 
మత్స్య సంపదను వృద్ధి చేసేందుకు తద్వారా మత్స్యకారులకు తగినంత జీవనోపాధి కల్పించేందుకు కూడా స్వాతంత్య్రం తరువాతే ప్రయత్నాలు మొదలయ్యాయి. 1970లలో తొలి పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఫిష్‌ ఫార్మర్స్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ స్థాపనతో మొదలైన ఈ కార్యక్రమం తరువాతి కాలంలో బహుముఖంగా విస్తరించింది. పలు రాష్ట్రాల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు సంస్థలు, కార్యక్రమాలు మొదలయ్యాయి. 
∙గిళియార్‌ గోపాలకృష్ణ మయ్యా

మరిన్ని వార్తలు