నయా ట్రెండ్‌: కారు అలా కొనేస్తున్నారట! 

31 Mar, 2021 11:36 IST|Sakshi

కారు కొనుగోలులో కొత్త పోకడ 

పెరుగుతున్న టెక్నాలజీ వాడకం 

ఎక్సెంట్రిక్‌ ఇంజన్‌ సర్వే

సాక్షి,న్యూఢిల్లీ: కారు కొనే ముందు షోరూంకి వెళ్లి ప్రత్యక్షంగా చూస్తాం. వీలైతే వాహనాన్ని నడుపుతాం. ఇదంతా పాత పద్దతి. ఇప్పుడు ట్రెండ్‌ మారుతోంది. షోరూంకి వెళ్లకుండానే కారు ఎలా ఉందో 3డీలో చూస్తున్నారు. 2020లో ఇలా 3డీని ఆసరాగా చేసుకుని కార్లను 76 లక్షల మంది భారతీయులు వీక్షించారని ఎక్సెంట్రిక్‌ ఇంజన్‌ తెలిపింది. 2019తో పోలిస్తే సంఖ్య పరంగా 300 శాతం వృద్ధి నమోదైందని చెబుతోంది. కరోన మూలంగా ఆఫ్‌లైన్‌ మార్కెటింగ్, షోరూంలలో ప్రమోషన్‌ కార్యక్రమాలకు అడ్డుకట్ట పడింది. దీంతో కార్ల ఎంపికకై కస్టమర్లు సాంకేతికత, ఆవిష్కరణ దన్నుగా ఉన్న ఆన్‌లైన్‌ను ఆసరాగా చేసుకుంటున్నారు. ఎక్సెంట్రిక్‌ ఇంజన్‌ వన్‌ 3డీ ప్లాట్‌ఫాం ద్వారా కార్లను 3డీ రూపంలో ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు. మారుతి సుజుకి, ఎంజీ, రెనో నిస్సాన్‌ మిత్సుబిషి తదితర సంస్థలు ఈ  కంపెనీకి క్లయింట్లుగా ఉన్నాయి.   (హోండా ప్రీమియం బైక్స్ : ధర ఎంతంటే)

ఆరు నగరాల నుంచే.. 
ఆన్‌లైన్‌లో కార్ల ఫీచర్లను వీక్షిస్తున్నవారిలో 51 శాతం మంది ఢిల్లీ, ముంబై, పుణే, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఉంటున్నారని ఎక్సెంట్రిక్‌ ఇంజన్‌ వెల్లడించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచీ ఆన్‌లైన్‌ను ఆసరాగా చేసుకుంటున్నారని వివరించింది. 2018–20 కాలంలో తృతీయ శ్రేణి నగరాల వాటా 9 శాతంగా ఉంది. సికింద్రాబాద్, ఉదయ్‌పూర్, ఇంఫాల్‌ వీటిలో ముందు వరుసలో ఉన్నాయి. ఆన్‌లైన్‌ వీడియోలతో పోలిస్తే నాలుగింతలు ఎక్కువగా 3డీ విధానంలో వీక్షిస్తున్నారని ఎక్సెంట్రిక్‌ ఇంజన్‌ కో–ఫౌండర్‌ వరుణ్‌ షా తెలిపారు. కస్టమర్లను ఆకట్టుకోవాలంటే తయారీ కంపెనీలకు 3డీ విధానం తప్పనిసరి అయిందని అన్నారు.  (ఆ ఐటీ నిపుణులకు కాగ్నిజెంట్‌ తీపి కబురు)

చూసిన కారునే కొంటున్నారు.. కొనే ముందు 3డీలో చూస్తున్నారు 
తాము కొనబోయే కారును 70 శాతం మంది మొబైల్‌ ద్వారా, 25 శాతం మంది డెస్క్‌టాప్‌ ద్వారా వీక్షిస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 4 మధ్య ఎక్కువగా బ్రౌజ్‌ చేస్తున్నారు. అత్యధికులు బుధవారం నాడు సర్చ్‌ చేస్తున్నారు. బ్లూ, వైట్‌ రంగులు ప్రధాన ఆకర్శణగా నిలిచాయి. 40 శాతం మంది ఈ రంగులను ఎంచుకున్నారు. గ్రే, బ్రౌన్, సిల్వర్‌ కలర్స్‌ను 35 శాతం, రెడ్, బ్లాక్, ఆరేంజ్‌ను 15 శాతం మంది ఇష్టపడ్డారు. ఆన్‌లైన్‌లో చూసిన కారునే కొన్నవారు 91 శాతం మంది ఉండడం గమనార్హం. విదేశాల్లో ఉన్న భారతీయులు తమ వారి కోసం ఆన్‌లైన్‌లో చూసి కొనుగోలు చేస్తున్నారు. 2020లో వీక్షకుల్లో 4.6 శాతం మంది ఎన్నారైలు ఉన్నారు. వీరిలో 31 శాతం ఉత్తర అమెరికా, మధ్యప్రాచ్య 32, యూరప్‌ 10, యూకే 5, ఆస్ట్రేలియా 4, ఆఫ్రికా నుంచి 2 శాతం ఉన్నారు.   

చదవండి :  దిగి వస్తున్న బంగారం ధరలు 

మరిన్ని వార్తలు