ఐపీవోలు కళకళ

20 Oct, 2020 05:16 IST|Sakshi

క్యూ2లో 8 పబ్లిక్‌ ఆఫర్లు

రూ.6,290 కోట్ల సమీకరణ

మైండ్‌స్పేస్‌ ఇష్యూ ఒక్కటే రూ. 4,230 కోట్లు

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్లు జూలై–సెప్టెంబర్‌ కాలంలో ర్యాలీ చేయడం ప్రైమరీ మార్కెట్‌కు కలిసొచ్చింది. సుమారు ఎనిమిది కంపెనీలు ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో)ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. 850 మిలియన్‌ డాలర్ల (రూ.6,290 కోట్ల) నిధులను సమీకరించాయి. ప్రస్తుత ఏడాది రెండో అర్ధభాగం (జూలై–డిసెంబర్‌)లో ప్రైమరీ మార్కెట్‌ ద్వారా నిధుల సమీకరణ మెరుగ్గా ఉండొచ్చని ఈవై నివేదిక తెలియజేసింది. ఈ సంస్థ 2020 సంవత్సరం మూడో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్‌) ఐపీవో ధోరణులపై సోమవారం నివేదిక విడుదల చేసింది. రియల్‌ ఎస్టేట్, ఆతిథ్యం, నిర్మాణం, టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్‌ కంపెనీలు నిధుల సమీకరణలో చురుగ్గా ఉన్నాయి. 2019 సెప్టెంబర్‌ త్రైమాసికంలో 12 ఐపీవోలు రాగా, ప్రస్తుత ఏడాది ఇదే కాలంలో ఇవి ఎనిమిదికి పరిమితం కావడం గమనార్హం. అయితే, ఐపీవోలు సంఖ్యాపరంగా తక్కువగానే కనిపించినా సమీకరించిన నిధులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అధికంగా ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 12 ఐపీవోలు కలసి సమీకరించిన మొత్తం 652 మిలియన్‌ డాలర్లు (రూ.4,824 కోట్లు)గానే ఉంది.  

బడా ఐపీవో ఒక్కటే...
ఈ ఏడాది సెప్టెంబర్‌ క్వార్టర్‌లో మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్‌ ఆర్‌ఈఐటీ ఐపీవో అతిపెద్దదిగా ఉంది. ఈ సంస్థ 602 మిలియన్‌ డాలర్లను (రూ.4,320 కోట్లు) సమీకరించింది. ‘‘ప్రధాన మార్కెట్లలో (బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ) 2020 క్యూ3లో నాలుగు ఐపీవోలు వచ్చాయి. కానీ 2019 క్యూలో 3 ఐపీవోలే వచ్చాయి. ఇక ఈ ఏడాది రెండో క్వార్టర్‌ (ఏప్రిల్‌–జూన్‌)లో ఒక్క ఐపీవో లేదు. దీంతో 2020 సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 33 శాతం వృద్ధి కనిపిస్తోంది’’ అని ఈవై ఇండియా తెలిపింది.  ఇక ఎస్‌ఎంఈ మార్కెట్లలో నాలుగు ఐపీవోలు నిధుల సమీకరణ పూర్తి చేసుకున్నాయి. 2020లో ఇప్పటి వరకు ఐపీవోల సంఖ్యా పరంగా భారత్‌ అంతర్జాతీయంగా తొమ్మిదో స్థానంలో ఉన్నట్టు ఈవై ఇండియా తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు ఐపీవో కార్యకలాపాలు 14 శాతం పెరిగాయని.. 872 ఐపీవోలు 43 శాతం అధికంగా 165.3 బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించాయని ఈ నివేదిక వివరించింది.

కల్యాణ్‌ జువెల్లర్స్‌ ఐపీవోకి గ్రీన్‌ సిగ్నల్‌
న్యూఢిల్లీ: ఆభరణాల సంస్థ కల్యాణ్‌ జువెల్లర్స్‌ ఇండియా ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూకి (ఐపీవో) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఆమోదముద్ర లభించింది. ఈ ఐపీవో ద్వారా సుమారు రూ. 1,750 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో భాగంగా రూ. 1,000 కోట్లు విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) కింద రూ. 750 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనుంది. కల్యాణ్‌ జువెల్లర్స్‌ ప్రమోటర్‌ టీఎస్‌ కల్యాణరామన్‌ దాదాపు రూ. 250 కోట్ల విలువ చేసే షేర్లను, హైడెల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ సుమారు రూ. 500 కోట్లు విలువ చేసే షేర్లను ఓఎఫ్‌ఎస్‌ ద్వారా విక్రయించనున్నాయి. ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను కల్యాణ్‌ జువెల్లర్స్‌ నిర్వహణ మూలధన అవసరాలు, ఇతరత్రా కార్యకలాపాల కోసం వినియోగించనుంది. ఈ ఏడాది జూన్‌ ఆఖరు నాటికి కంపెనీకి దేశవ్యాప్తంగా 107, మధ్యప్రాచ్య దేశాల్లో 30 షోరూమ్‌లు ఉన్నాయి.

ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ ఆఫర్‌ ప్రారంభం  
ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ మంగళవారం(అక్టోబర్‌ 20న) ఐపీఓ ప్రారంభం కానుం ది. మూడు రోజుల పాటు కొనసాగే ఈ ఇష్యూ గురువారం(అక్టోబర్‌ 22న)ముగిస్తుంది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ.517.6 కోట్లు సమీకరించనుంది. ఈ ఏడాదిలో 12వదైన ఈ ఐపీఓ ధర శ్రేణి రూ.32–33 మధ్య ఉంది.

మరిన్ని వార్తలు