గ్రీన్‌కార్డ్‌ వెయిటింగ్‌ లిస్ట్‌లో 8 లక్షల మంది!

23 Nov, 2020 11:03 IST|Sakshi

యూఎస్‌ సిటిజన్‌షిప్‌ కోసం ఎదురుచూపులు

ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల మంది దరఖాస్తు

జాబితాలో భారతీయుల వాటా 68 శాతం

అమెరికన్‌ చరిత్రలో ఇది గరిష్ట రికార్డ్‌

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా యూఎస్‌ సిటిజన్‌షిప్‌ కోసం వేచిచూస్తున్న వారి జాబితా 2020లో 1.2 మిలియన్లకు చేరింది. యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది యూఎస్‌ చరిత్రలో అత్యధికమని క్యాటో ఇన్‌స్టిట్యూట్‌ పేర్కొంది. యూఎస్‌ సిటిజన్‌షిప్‌ను కల్పించే గ్రీన్‌కార్డు పొందేందుకు వేచిచూస్తున్న జాబితాలో భారతీయుల సంఖ్య 8 లక్షలకు చేరినట్లు యూఎస్‌సీఐఎస్ పేర్కొంది. గ్రీన్‌కార్డు దరఖాస్తుదారుల్లో భారతీయుల వాటా 68 శాతానికి సమానమని తెలియజేసింది. కాగా.. వెయిటింగ్‌ లిస్ట్‌ అధికంగా ఉండటం, జారీకి పట్టే కాలాన్ని పరిగణిస్తే.. సుమారు 2 లక్షల మందికి తమ జీవితకాలంలో గ్రీన్‌కార్డ్‌ అందే అవకాశాలు లేనట్లేనని క్యాటోకు చెందిన సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ లిబర్టీ అండ్‌ ప్రాస్పెసరిటీ అభిప్రాయపడింది.

చైనీస్‌కు రెండో ర్యాంకు
యూఎస్‌ గ్రీన్‌కార్డులు పొందేందుకు వేచిచూస్తున్న జాబితాలో భారతీయుల తదుపరి చైనీయులు అధికంగా ఉన్నట్లు యూఎస్‌సీఐఎస్ తాజాగా వెల్లడించింది. ప్రపంచంలోని మిగిలిన దేశాలవారు 18 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు వివరించింది. శాశ్వత ఉపాధి కార్యక్రమంలో భాగంగా యూఎస్‌ ప్రభుత్వం ఎంప్లాయ్‌మెంట్‌ గ్రీన్‌కార్డులను జారీ చేస్తోంది. తద్వారా అత్యంత నైపుణ్యమున్న వారికి దేశంలో నివసించేందుకు వీలు కల్పిస్తోంది. వార్షికంగా 1.4 లక్షల మందికి మించి ఎంప్లాయ్‌మెంట్‌ గ్రీన్‌కార్డుల జారీకి అవకాశంలేదని ఈ సందర్భంగా విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. కొత్త ప్రెసిడెంట్‌గా ఎన్నికైన జో బైడెన్‌ ఈ అంశంలో సంస్కరణలు తీసుకువచ్చినప్పటికీ ప్రాసెస్‌ పూర్తికావడానికి చాలా కాలంపట్టవచ్చని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు