జోరుగా..హుషారుగా! 80 స్టార్టప్‌లు ఐపీవోకు

14 Dec, 2022 09:02 IST|Sakshi

దూకుడు చూపుతున్న 100 కంపెనీలు 

ఇప్పటికే లిస్టింగ్‌ పొందిన 20 సంస్థలు 

భారీ విస్తరణ, లాభార్జనకు అవకాశం 

న్యూఢిల్లీ: రానున్న ఐదేళ్లలో దేశీయంగా 80 స్టార్టప్‌లు పబ్లిక్‌ ఇష్యూలను చేపట్టే అవకాశమున్నట్లు మార్కెట్‌ రీసెర్చ్, కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్‌ తాజాగా అంచనా వేసింది. ఈ కాలంలో 100కు మించిన సంస్థలు మరింత బలపడనున్నట్లు, భారీ స్థాయిలో లాభాలు ఆర్జించేందుకు వీలున్నట్లు అభిప్రాయపడింది. ఐపీవోలపై రెడ్‌సీర్‌ స్ట్రాటజీ కన్సల్టెంట్స్‌ రూపొందించిన నివేదికలో ఇప్పటికే కార్యకలాపాలను విస్తరించిన 20 స్టార్టప్‌లు ఎక్సేంజీల్లో లిస్టయినట్లు వెల్లడించింది. దేశీయంగా మరో 100కు పైగా స్టార్టప్‌లు మరింత ఎదిగే వీలుందని, భారీ లాభార్జన స్థాయికి చేరవచ్చని పేర్కొంది. ఈ జాబితాలో ఇప్పటికే 20 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలను పూర్తి చేసుకున్నట్లు ప్రస్తావించింది. వెరసి మరో 80 కంపెనీలు ఐదేళ్లలో ఐపీవోల ద్వారా నిధుల సమీకరణకు ముందుకురానున్నట్లు అంచనా వేసింది.   

టెక్‌ కంపెనీలు వీక్‌:
ప్రపంచ ఆర్థిక పరిస్థితుల కారణంగానే వినియోగ కంపెనీలతో పోలిస్తే టెక్నాలజీ సంస్థల ఐపీవోలు పతన బాటలో సాగుతున్నట్లు హెచ్‌ఎస్‌బీసీ సహకారంతో రూపొందిన రెడ్‌సీర్‌ నివేదిక పేర్కొంది. అయితే టెక్నాలజీ కంపెనీలు ప్రస్తుతం వృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపింది. వచ్చే రెండేళ్లలో సానుకూల నగదు ఆర్జనను సాధించగల కీలక కంపెనీలు ప్రస్తుతం 20-30శాతం డిస్కౌంట్‌లో ఉన్నట్లు పేర్కొంది. ఇందుకు చౌక వడ్డీ రేట్లు కారణంకాగా.. ఇకపై మరింత ఊపందుకోనున్న వడ్డీ రేట్ల పరిస్థితుల్లో విలువ వేగంగా బలపడనున్నట్లు అభిప్రాయపడింది. ఇతర దేశాలతో పోలిస్తే దేశీయంగా లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ వృద్ధి చూపనున్నట్లు అంచనా వేసింది.  (కొత్త ఏడాదిలో యూజర్లకు షాకివ్వనున్న టాటా మోటార్స్‌)

కారణాలున్నాయ్‌: 
యూఎస్‌ స్టాక్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 43 లక్షల కోట్ల డాలర్లలో టెక్నాలజీ లేదా న్యూఏజ్‌ కంపెనీల వాటా 25 శాతంగా నివేదిక పేర్కొంది. వీటిలో యాపిల్‌ ఇంక్, అమెజాన్‌ తదితర దిగ్గజాలున్నట్లు తెలియజేసింది. ఇక ఇండియాలో 3.9 లక్షల కోట్ల డాలర్ల స్టాక్‌ మార్కెట్‌ విలువలో టెక్‌ లేదా న్యూఏజ్‌ కంపెనీల వాటా 1 శాతమేనని వివరించింది. గత రెండు దశాబ్దాలలోనూ ఇదేతరహా పరిస్థితులను పరిశీలిస్తే.. వడ్డీ రేట్లు నీరసించినప్పటికీ మార్కెట్లు నిలకలకడను సాధించేందుకు కొంత సమయం పట్టినట్లు రెడ్‌సీర్‌ సంస్థ పార్టనర్‌ రోహన్‌ అగర్వాల్‌ తెలియజేశారు. మార్కెట్లు రికవరీ సాధించేందుకు మరింత సమయం పట్టవచ్చని అంచనా వేశారు. డౌన్‌టర్న్‌ల తదుపరి ఐపీవోలు జోరు చూపడం చూస్తున్నదేనని ప్రస్తావించారు. కాగా.. ఐపీవో బాటలో విజయవంతమయ్యేందుకు మార్కెట్‌ లీడర్‌షిప్, విస్తరించవలసిన మార్కెట్లు, నమ్మకమైన ఆదాయ అంచనాలు, లాభదాయకతకు స్పష్టమైన ప్రణాళికలు వంటి పలు కీలక అంశాలపై స్టార్టప్‌లు దృష్టిసారించవలసి ఉన్నట్లు వివరించారు. (టెక్‌ మహీంద్ర ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌)

మరిన్ని వార్తలు