వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కే 88శాతం ఉద్యోగుల ఓటు..!

29 Jul, 2020 14:14 IST|Sakshi

భారత్‌లో 88శాతం మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కే మొగ్గుచూపుతున్నట్లు యస్‌ఏపీ కాంకర్‌ సర్వే తెలిపింది. ఇంటి వద్ద నుంచి పని చేయడాన్ని ఉద్యోగులు సౌకర్యవంతగా భావిస్తున్నారని సర్వే తెలిపింది. దేశవ్యాప్తంగా ఆయా రంగాలకు చెందిన 300కంపెనీల ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నివేదికను తయారీ చేసినట్లు కాంకర్‌ సర్వే తెలిపింది. ఇంటివద్ద నుంచి పనిచేసేటప్పుడు తమ ఉత్పాదక సామర్థ్యం మరింత పెరుగుతుందని 69శాతం మంది ఉద్యోగులు నమ్ముతున్నారు. ఇంట్లో పని చేయడంతో సమయం ఆదా అవుతుందని, కంపెనీలకే లాభమని ఉద్యోగులు విశ్వసిస్తున్నట్లు సర్వే తన నివేదికలో చెప్పుకొచ్చింది. అలాగే వర్క్‌-ఫ్రమ్‌-హోమ్‌ అవకాశాన్ని కల్పించిన కంపెనీలు తమకు అవసరమైన బ్రాండ్‌బాండ్‌ ఇంటర్నెట్‌, మొబైల్‌ రీఛార్జ్‌లు, ల్యాబ్స్‌ట్యాబ్స్‌ లాంటి కనీస సదుపాయాలను అందిస్తున్నట్లు 77శాతం మంది తెలిపారు. మిగిలిన 11శాతం మంది ఆఫీస్‌లో పనిచేసేందుకే ఆసక్తి చూపుతున్నారని నివేదిక తెలిపింది. కంపెనీలో అయితే హై స్పీడ్ డేటా ఉంటుందని, టీమ్ వర్క్ ఉంటుందని, స్నేహితులు ఉంటారని వారు భావిస్తున్నారు. మిగిలిన 1శాతం మంది తాము ఇల్లు లేదా ఆఫీసుల్లో ఎక్కడైన పని చేసేందుకు సిద్ధమని తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనాకేసులు పెరుగుతుండటంతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు