నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపర్చుకోవాలి

27 Sep, 2021 04:13 IST|Sakshi

కోవిడ్‌–19 సంక్షోభం నేరి్పన పాఠం

పీడబ్ల్యూసీ సర్వేలో వ్యాపార దిగ్గజాల అభిప్రాయం

న్యూఢిల్లీ: సంక్షోభాన్నుంచి గట్టెక్కేందుకు నిర్వహణ సామర్థ్యాలను మరింతగా మెరుగుపర్చుకోవాల్సిన అవసరాన్ని కోవిడ్‌–19 మహమ్మారి ప్రత్యేకంగా తెలియజెప్పిందని 90 శాతం మంది దేశీ వ్యాపార దిగ్గజాలు అభిప్రాయపడ్డారు. దీన్నుంచి నేర్చుకున్న పాఠాలను, భవిష్యత్తులో కచ్చితంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ సంస్థల్లో లీడర్ల కన్నా  మన వారు చాలా ధీమాగా ఉన్నారు. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా నిర్వహించిన ఒక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం కరోనా కారణంగా తమ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడిందని సుమారు 59 శాతం దేశీ సంస్థలు తెలిపాయి.

కరోనా వైరస్‌ నేపథ్యంలో టెక్నాలజీపై గణనీయంగా ఇన్వెస్ట్‌ చేసినట్లు 80 శాతం కంపెనీలు తెలిపాయి. అంతర్జాతీయ సంక్షోభ సర్వే 2021లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార వర్గాలు వ్యక్తపర్చిన అభిప్రాయాలనే దేశీయంగా కూడా దిగ్గజాలు కాస్త అటూ, ఇటూగా వ్యక్తపర్చినట్లు పీడబ్ల్యూసీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 2,800 పైచిలుకు బిజినెస్‌ లీడర్లు తమ కంపెనీ డేటాను, కరోనా ప్రభావాలపై వ్యక్తిగత అభిప్రాయాలను, భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికలను ఈ సర్వేలో తెలియజేశారు. సంక్షోభ సమయంలో గుర్తించిన సమస్యలను పరిష్కరించుకోవడం, భారీ అవాంతరాలపై తక్షణం స్పందించేందుకు వ్యూహాన్ని రూపొందించుకోవడం, చర్యల అమలు తర్వాత ప్రక్రియలను సమీక్షించుకోవడం తదితర 5 అంశాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు వారు తెలిపారు. 

మరిన్ని వార్తలు