లెక్క ఎక్కువైనా పర్లేదు..మాకు కాస్ట్‌లీ ఇళ్లే కావాలి!

19 Apr, 2023 04:48 IST|Sakshi

96 శాతం ఆశావహుల అభిప్రాయం

ధరలు ముఖ్యమైన అంశమని వెల్లడి

అనరాక్‌–సీఐఐ సర్వే నివేదిక

ముంబై: గృహ రుణాలపై వడ్డీ రేట్లు మరింత పెరిగితే అది తమ భవిష్యత్తు కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుందని 96 శాతం మంది కొనుగోలుదారులు (ఇల్లు కొనాలని అనుకుంటున్నట్టు) చెప్పారు. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్, సీఐఐతో కలసి దీనిపై ఓ సర్వే నిర్వహించింది. ‘ద హౌసింగ్‌ మార్కెట్‌ బూమ్‌’ పేరుతో నివేదిక విడుదల చేసింది. ఆర్‌బీఐ గతేడాది మే నుంచి ఇప్పటి వరకు రెపో రేటుని 2.5 శాతం మేర పెంచడం తెలిసిందే.

ఇటీవలి ఏప్రిల్‌ సమీక్షలో మాత్రం రేట్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తటస్థ వైఖరిని ప్రదర్శించింది. ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారిలో 80 శాతం మంది తమకు ధరలు ముఖ్యమైన అంశమని చెప్పారు. ఒకవైపు నిర్మాణంలో వినియోగించే ముడి సరుకుల ధరలు పెరిగిన ఫలితంగా ప్రాపర్టీల ధరలకు సైతం రెక్కలు రావడం తెలిసిందే. దీనికి తోడు గృహ రుణాలపై రేట్లు 2.5 శాతం మేర పెరగడం భారాన్ని మరింత పెరిగేలా చేసింది.  

విశాలమైన ఇంటికే ప్రాధాన్యం..
ధరలు పెరిగినప్పటికీ వినియోగదారుల ప్రాధాన్యతల్లో పెద్ద మార్పు కనిపించలేదు. 42 శాతం మంది 3బీహెచ్‌కే ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. 40 శాతం మంది 2బీహెచ్‌కే ఇళ్ల కొనుగోలుకు అనుకూలంగా ఉండగా, 12 శాతం మంది ఒక్క పడకగది ఇంటి కోసం చూస్తున్నారు. 6 శాతం మంది అయితే 3బీహెచ్‌కే కంటే పెద్ద ఇళ్లను సొంతం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 58 శాతం మంది తాము రూ.45 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధరలో ఇంటిని కొనుగోలు చేస్తామని చెప్పారు.

ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసుకునే ఇంటికే తాము ప్రాధాన్యం ఇస్తామని 36 శాతం మంది తెలిపారు. దేశ రాజధాని ప్రాంత పరిధిలో ఇల్లు కొనుగోలు చేయాలని చూస్తున్న వారిలో 45 శాతం మంది 3బీహెచ్‌కే తీసుకోవాలని అనుకుంటున్నారు. ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌)లో 42 శాతం మంది ఎంపిక 2బీహెచ్‌కేగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్టీ ధరలు చాలా ఎక్కువగా ఉండడం కొనుగోలు ప్రాధాన్యతల్లో మార్పునకు కారణమని తెలుస్తోంది. ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారిలో 52 శాతం మంది సొంత వినియోగానికేనని చెప్పారు.

ప్రతికూల పరిస్థితుల ప్రభావం
ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో ఉండడం, అంతర్జాతీ య ఆర్థిక వ్యవస్థలో ఉన్న అనిశ్చితి ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశీయ హౌసింగ్‌ డిమాండ్‌పై ప్రభావం చూపిస్తున్నట్టు అనరాక్‌ చైర్మన్‌ అనుజ్‌పురి అన్నారు. మొత్తం మీద ఇళ్ల డిమాండ్‌లో రేట్ల పెంపు ఒక భాగమేనని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పెద్దా, చిన్న కంపెనీల్లో ఉద్యోగాల కోతలు సైతం ఇళ్ల కొనుగోలు డిమాండ్‌పై ఎంతో కొంత ప్రభావం చూపిస్తాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు ఇంటి కొనుగోలును వాయిదా వేసుకోవచ్చన్నారు. 2024–25 నాటికి అన్ని సమస్యలు సమసిపోయి, హౌసింగ్‌ మార్కెట్‌ తిరిగి బలంగా పుంజు కుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు