ఐఫోనా మజాకా? మైనర్‌ కిడ్నాప్‌ డ్రామా...కట్‌చేస్తే..!

18 Mar, 2023 20:22 IST|Sakshi

ఖరీదైన ఐఫోన్‌  కోసం 9వ తరగతి  కిడ్నాప్‌ డ్రామా ఆడిన ఘటన వెలుగులోకి వచ్చింది. చిరు వ్యాపారి అయిన తండ్రి ఐఫోన్‌ కొనివ్వలేకపోవడంతో ఎలాగైనా తన పంతం నెరవేర్చుకోవాలనుకున్నాడు. తనను తానే  కిడ్నాప్‌ చేసుకున్నాడు చివరికి పోలీసుల చేతికి  గతుక్కుమన్నాడు.

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి తానే కిడ్నాప్‌  అయినట్టుగా డ్రామా ఆడాడు. ఆ తరువాత తన స్నేహితుడి ఫోన్‌ ద్వారా తండ్రికి ఫోన్‌ చేసి రూ. 5 లక్షలు డిమాండ్‌ చేశాడు. ఈ విషయంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి,  లొకేషన్‌ను ఆధారంగా వారిని పట్టుకున్నారు. 

సీతాపూర్ కొత్వాలి  పోలీసు అధికారి చెప్పిన వివరాల ప్రకారం నిందితుడు మైనర్‌కు ఏడాది వయసున్నప్పుడే తల్లి చనిపోయింది. దీంతో గారాబంగా పెరిగాడు. రెండు రోజుల క్రితం పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థి ఇంటికి తిరిగి రాకపోవడంతో, అతని తండ్రి, ఇతర బంధువులు కంగారుపడి వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో  5 లక్షల రూపాయలు డిమాండ్‌ చేస్తూ వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. ఆ మొత్తాన్ని ఖైరాబాద్‌లో(యూపీ) మసీదు సమీపంలో డెలివరీ చేయాలని కూడా చెప్పాడు. దీంతో తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన జిల్లా పోలీసులు, సైబర్, ఎస్‌ఓజీ బృందాలు  వివరాలు ఆరాతీశారు. ఫోన్ ఫుట్‌వేర్ షాప్ యజమానిదిగా గుర్తించి  విచారించగా ఆఫోన్‌ను వాళ్లబ్బాయి వాడుతున్నట్టు తేలింది. ఎట్టకేలకు ఇద్దరినీ కనుగొన్న పోలీసులు  కౌన్సెలింగ్‌ అనంతరం వారిని కుటుంబాలకు అప్పగించారు.

మరిన్ని వార్తలు