ఆధార్‌ ఈ కేవైసీ లావాదేవీలు 29 కోట్లు

31 Dec, 2022 01:50 IST|Sakshi

నవంబర్‌లో 22 శాతం అధికం

11 నెలల్లో 1350 కోట్ల లావాదేవీలు

న్యూఢిల్లీ: ఆధార్‌ ఆధారిత ఈ–కేవైసీ లావాదేవీలు నెలవారీగా చూస్తే నవంబర్‌లో 22 శాతం పెరిగాయి. 28.75 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది నవంబర్‌ వరకు 1,350 కోట్ల మైలురాయిని లావాదేవీలు అధిగమించాయి. ఆధార్‌ ధ్రువీకృత లావాదేవీలు సైతం నవంబర్‌లో 11 శాతం అధికంగా 195 కోట్లు నమోదయ్యాయి. ఆధార్‌ వాడకం దేశవ్యాప్తంగా పెరుగుతోందని, చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనమని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ ఐటీ శాఖ ప్రకటించింది. ఆధార్‌ ఈ కేవైసీ లావాదేవీ అంటే.. బ్యాంక్‌ ఖాతా కోసం ఈ–కేవైసీ ఇస్తాం కదా, ఇది ఒక లావాదేవీ కిందకు వస్తుంది. ఆధార్‌ ఈ–కేవైసీ లావాదేవీల వృద్ధికి ప్రధానంగా బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక లావాదేవీలు మద్దతునిస్తున్నాయి.

ఈ–కేవైసీ వల్ల పేపర్‌ డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన ఇబ్బంది తప్పిపోయింది. ఇది వచ్చిన తర్వాత బ్యాంక్‌ ఖాతాలు, టెలికం సిమ్‌ కార్డుల జారీ, కొత్త కస్టమర్లను చేర్చుకోవడం తదితర సేవలు ఎంతో సులభంగా మారడం తెలిసిందే. ఆధార్‌ హోల్డర్‌ వ్యక్తిగతంగా హాజరై వేలిముద్ర, ఓటీపీ ఇస్తేనే ధ్రువీకరణ కావడం ఇందులో భద్రతకు హామీ ఇస్తోంది. ఇక ఆధార్‌ ఈ–కేవైసీ విధానం వచ్చిన నాటి నుంచి ఈ ఏడాది నవంబర్‌ వరకు మొత్తం 8,621 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఆధార్‌ ఆధారిత చెల్లింపులు రూ.1,592 కోట్లుగా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో 1,100 ప్రభుత్వ పథకాల కింద ప్రయోజనాలు అసలైన లబ్ధిదారులకు వేగంగా, పారదర్శకంగా చేరేందుకు ఆధార్‌ ఉపకరిస్తున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ ఐటీ శాఖ తెలిపింది.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు