విమానాశ్రయాల నిర్వహణలో ‘అదానీ’ ఉల్లంఘనలు

23 Jul, 2021 04:48 IST|Sakshi

గుర్తించిన ఏఏఐ కమిటీలు

ఆ తర్వాత దిద్దుబాటు చర్యలు  

న్యూఢిల్లీ: అహ్మదాబాద్, మంగళూరు, లక్నో విమానాశ్రయాల నిర్వహణలో బ్రాండింగ్, రాయితీల ఒప్పందాల నిబంధనలను అదానీ గ్రూపు ఉల్లంఘించినట్టు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) కమిటీలు గుర్తించాయి. దీంతో అదానీ గ్రూపు ఏఏఐతో చేసుకున్న ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా బ్రాండింగ్, ఎయిర్‌పోర్ట్‌ల్లో లోగోల ప్రదర్శనలకు సంబంధించి మార్పులు చేసింది. ఈ విమానాశ్రయాల నిర్వహణ బాధ్యతలను గతేడాదే అదానీ ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ (ఏఏహెచ్‌ఎల్‌) చేపట్టింది.

2020 డిసెంబర్‌లో ఈ మూడు విమనాశ్రయాలకు సంబంధించి బ్రాండింగ్, డిస్‌ప్లే నిబంధనలకు అనుగుణంగా లేవని ఏఏఐ గుర్తించి ఆయా విమానాశ్రయ నిర్వహణ కంపెనీలకు లేఖలు రాసింది. దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే, తామేమే నిబంధనలను ఉల్లంఘించలేదంటూ అదానీ గ్రూపు విమానాశ్రయాలు బదులిచ్చాయి. దీంతో ఏఏఐ ఈ ఏడాది జనవరిలో మూడు వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేసి అదానీ గ్రూపు నిర్వహణలోని మూడు విమానాశ్రయాల్లో హోర్డింగ్‌లు,డిస్‌ప్లే, బ్రాండింగ్‌ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో, లేవో? తేల్చాలని కోరింది. ఈ కమిటీలో తమ అధ్యయనం అనంతరం నిబంధనల ఉల్లంఘనను నిర్ధారించాయి. ఏఏఐ పేరు, లోగో ప్రముఖంగా కనిపించడం లేదంటూ.. ఏఏఐ లోగో, పేరు చిన్నగాను, అదానీ కంపెనీల పేరు పెద్దగాను ఉన్నాయంటూ నివేదికలు ఇచ్చాయి.

మెరుగైన సదుపాయాలకు కట్టుబడి ఉన్నాం
ఏఏఐ కమిటీలు గుర్తించిన వాస్తవాలతో అదానీ గ్రూపు అంగీకరిస్తోందా? అన్న ప్రశ్నకు.. ‘‘ఒప్పందం ప్రకారం ఇరు సంస్థల లోగోలు (అదానీ, ఏఏఐ) ఒకే సైజులో ప్రముఖంగా కనిపించే విధంగా ఉండాలి. రెండు బలమైన బ్రాండ్లు ప్రముఖంగా కనిపించడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య ఒప్పంద స్ఫూర్తి ఫరిడవిల్లుతుంది’’ అని అదానీ గ్రూపు ప్రతినిధి స్పందించారు.

మరిన్ని వార్తలు