ఎలక్ట్రిక్ కారు కొనుగోలుదారులకు అదిరిపోయే శుభవార్త!

30 Sep, 2021 18:10 IST|Sakshi

మీరు కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. స్విస్ ఇంజనీరింగ్ కంపెనీ ఏబీబీ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారు ఛార్జర్‌ని "టెర్రా 360" పేరుతో విడుదల చేసింది. దాదాపు 3 బిలియన్ డాలర్ల విలువైన ప్రణాళికలతో వచ్చినట్లు తెలిపింది. కంపెనీ కొత్తగా విడుదల చేసిన టెర్రా 360 మాడ్యులర్ ఛార్జర్ ఒకేసారి నాలుగు వాహనాలను ఛార్జ్ చేయగలదు. 15 నిమిషాల్లో 500 కి.మీ వెళ్లగల ఒక ఎలక్ట్రిక్ కారును ఫుల్ ఛార్జ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే, ఎలక్ట్రిక్ కారును 3 నిమిషాల పాటు చార్జ్ చేస్తే 100 కి.మీల దూరం వెళ్లనున్నట్లు పేర్కొంది. ఈ కొత్త ఛార్జర్ గరిష్టంగా 360 kW అవుట్‌పుట్ కలిగి ఉంది.

ఈ ఏడాది చివరినాటికి యూరప్, యునైటెడ్ స్టేట్స్‌లో అందుబాటులోకి వస్తుంది అని తెలిపింది. లాటిన్ అమెరికా, ఆసియా పసిఫిక్ ప్రాంతాలలో 2022లో తీసుకొని రానున్నట్లు తెలిపింది. ఏబీబీ ఛార్జర్‌లకు డిమాండ్ పెరుగుతోంది. 2010లో ఈ-మొబిలిటీ వ్యాపారంలోకి ప్రవేశించినప్పటి నుంచి 88కి పైగా మార్కెట్లలో 4,60,000 ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జర్‌లను విక్రయించింది. ఎలక్ట్రో ఛార్జింగ్ వ్యాపారంలో తన హవాను కొనసాగించాలని కోరుకుంటుంది. 2020లో 220 మిలియన్ డాలర్ల విక్రయాలు కలిగిన ఏబీబీ వాహన ఛార్జింగ్ వ్యాపారం ఒక ఫ్లోట్‌లో సుమారు 3 బిలియన్ డాలర్ల విలువను సాధించగలదని రాయిటర్స్ నివేదించింది.(చదవండి: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!)

మరిన్ని వార్తలు