కర్ణాటకలో ఏబీసీ క్లీన్‌టెక్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంటు

11 Nov, 2022 08:07 IST|Sakshi

బెంగళూరు: పునరుత్పాదక విద్యుత్‌ రంగ దిగ్గజం యాక్సిస్‌ ఎనర్జీ గ్రూప్‌లో భాగమైన ఏబీసీ క్లీన్‌టెక్‌ తాజాగా కర్ణాటకలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పనుంది. ఇందుకోసం రూ. 50,000 కోట్లు వెచ్చించనుంది. దీనికి సంబంధించి ఇన్వెస్ట్‌ కర్ణాటక 2022 కార్యక్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ యూనిట్‌తో వచ్చే 10 ఏళ్లలో 5,000 మందికి ఉపాధి కల్పన జరుగుతుందని ఏబీసీ క్లీన్‌టెక్‌ సీఎండీ రవి కుమార్‌ రెడ్డి తెలిపారు. 

జీరో కార్బన్‌ ఎకానమీగా ఎదిగేందుకు, స్థానిక ఎకానమీకి తోడ్పాటు అందించేందుకు ఇది దోహదపడగలదని ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు. సమతౌల్యమైన అభివృద్ధి సాధనకు, భవిష్యత్‌ తరాలకి సురక్షితమైన.. ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని అందించేందుకు పునరుత్పాదక శక్తి ఒక్కటే మార్గమని కర్ణాటక అదనపు చీఫ్‌ సెక్రటరీ ఈవీ రమణా రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. 

గతేడాది అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పొందిన రాష్ట్రంగా కర్ణాటక నిల్చినట్లు ఆయన వివరించారు. హైదరాబాదీ సంస్థ యాక్సిస్‌ ఎనర్జీ, అతి పెద్ద అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల్లో ఒకటైన బ్రూక్‌ఫీల్డ్‌ భాగస్వామ్యంలో జాయింట్‌ వెంచర్‌ గా ఏబీసీ రెన్యువబుల్స్‌ను ఏర్పాటైంది. ఇది ప్రస్తుతం 2 గిగావాట్ల పైగా సామర్థ్యమున్న ప్రాజెక్టులను నిర్మిస్తోంది.  

మరిన్ని వార్తలు