అదానీ గ్రీన్‌కు భారీ పెట్టుబడులు

9 Apr, 2022 04:26 IST|Sakshi

రూ. 15,000 కోట్లకు ఐహెచ్‌సీ(అబుదాబి) రెడీ

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ దిగ్గజం అదానీ గ్రూప్‌ పర్యావరణ అనుకూల కంపెనీలలో ఇంటర్నేషనల్‌ హోల్డింగ్‌ కంపెనీ(ఐహెచ్‌సీ) భారీగా ఇన్వెస్ట్‌ చేయనుంది. అబు దాబికి చెందిన ఐహెచ్‌సీ అదానీ గ్రూప్‌నకు చెందిన మూడు గ్రీన్‌ కంపెనీలకు 200 కోట్ల డాలర్లు(సుమారు రూ. 15,000 కోట్లు) పెట్టుబడులు అందించనుంది. గ్రూప్‌ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌(ఏఈఎల్‌)లో రూ. 7,700 కోట్లు(1.02 బిలియన్‌ డాలర్లు), అదానీ గ్రీన్‌ ఎనర్జీ(ఏజీఈఎల్‌)లో రూ. 3,850 కోట్ల చొప్పున ఇన్వెస్ట్‌ చేయనుంది.

ఈ బాటలో అదానీ ట్రాన్స్‌మిషన్‌(ఏటీఎల్‌)కు సైతం రూ. 3,850 కోట్లు అందించనుంది. ఇందుకు వీలుగా మూడు కంపెనీలూ ఐహెచ్‌సీకి ప్రిఫరెన్షియల్‌ షేర్లను జారీ చేయనున్నాయి. ఇందుకు శుక్రవారం సమావేశమైన కంపెనీల బోర్డులు ‘గ్రీన్‌’సిగ్నల్‌ ఇచ్చాయి. అయితే తద్వారా మూడు కంపెనీలలోనూ ఐహెచ్‌సీకి ఎంతమేర వాటా లభించనున్నదీ అదానీ గ్రూప్‌ వెల్లడించలేదు. తాజా పెట్టుబడులను ఆయా కంపెనీల బిజినెస్‌ వృద్ధికి వినియోగించనున్నట్లు పేర్కొంది. బ్యాలెన్స్‌షీట్లను పటిష్టపరచడం, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు సైతం నిధులను వెచ్చించనున్నట్లు తెలియజేసింది.

మరిన్ని వార్తలు