నిరుత్సాహకర ఫలితాలు..ఏసీసీ లాభం 30 శాతం డౌన్‌ 

20 Apr, 2022 08:28 IST|Sakshi

క్యూ1లో రూ. 396 కోట్లు 

ఆదాయం 3 శాతం ప్లస్‌ 

న్యూఢిల్లీ: సిమెంట్‌ రంగ దిగ్గజం ఏసీసీ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ1(జనవరి–మార్చి)లో నికర లాభం దాదాపు 30 శాతం క్షీణించింది. రూ. 396.3 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021) ఇదే కాలంలో రూ. 563 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా 3 శాతం పుంజుకుని దాదాపు రూ. 4,427 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 4,292 కోట్ల అమ్మకాలు సాధించింది.

స్విస్‌ బిల్డింగ్‌ మెటీరియల్‌ దిగ్గజం హోల్సిమ్‌ గ్రూప్‌నకు అనుబంధ సంస్థ అయిన ఏసీసీ జనవరి–డిసెంబర్‌ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. కాగా.. ఈ క్యూ1లో మొత్తం వ్యయాలు 10 శాతంపైగా పెరిగి రూ. 3,956 కోట్లను దాటాయి. ఈ కాలంలో భౌగోళిక, రాజకీయ అనిశ్చితులతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన వ్యయాలు పెరిగినట్లు ఏసీసీ ఎండీ, సీఈవో శ్రీధర్‌ బాలకృష్ణన్‌ పేర్కొన్నారు. దీంతో లాభాలపై ప్రతికూల ప్రభావం పడినట్లు తెలియజేశారు. అయితే సామర్థ్య వినియోగం, వ్యయ నియంత్రణలు కొంతమేర ఆదుకున్నట్లు వెల్లడించారు.   రానున్న నెలల్లో సిమెంటుకు డిమాండ్‌ మరింత పుంజుకోనున్నట్లు శ్రీధర్‌ అంచనా వేశారు. 

క్యూ1 ఫలితాల నేపథ్యంలో ఏసీసీ షేరు బీఎస్‌ఈలో 4.5% పతనమై రూ. 2,058 వద్ద ముగిసింది. 

చదవండి: అదరగొట్టిన ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌..మైండ్‌ట్రీతో విలీనంపై కీలక వ్యాఖ్యలు..!

మరిన్ని వార్తలు