డిమాండ్‌ తగ్గింది, దేశంలో 76% పడిపోయిన ఇళ్ల అమ్మకాలు

8 Jul, 2021 00:40 IST|Sakshi

దేశంలో 76% క్షీణించిన గృహ విక్రయాలు

ప్రాప్‌టైగర్‌ రిపోర్ట్‌  

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశీయ రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని వదలట్లేదు. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికం (క్యూ2)లో గృహ విక్రయాలు 76 శాతం క్షీణించాయి. జనవరి–మార్చి (క్యూ1)లో 66,176 యూనిట్లు అమ్ముడుపోగా.. క్యూ2 నాటికి 15,968 యూనిట్లకు తగ్గాయని హౌసింగ్‌ బ్రోకరేజ్‌ కంపెనీ ప్రాప్‌టైగర్‌ ‘రియల్‌ ఇన్‌సైట్‌’ రిపోర్ట్‌ తెలిపింది. గతేడాది క్యూ2తో పోలిస్తే 16 శాతం తగ్గుదల కనిపించిందని పేర్కొంది.

త్రైమాసికం ప్రాతిపదికన దేశంలోని అన్ని ప్రధాన నగరాలల్లో హౌసింగ్‌ సేల్స్‌ తగ్గగా.. వార్షిక లెక్కన మాత్రం కొన్ని నగరాలల్లో వృద్ధి నమోదయిందని ప్రాప్‌టైగర్‌ గ్రూప్‌ సీఈఓ ధ్రవ్‌ అగర్వాల్‌ తెలిపారు. హైదరాబాద్‌లో 2021 క్యూ1లో 7,721 గృహాలు అమ్ముడుపోగా.. క్యూ2 నాటికి 2,429 యూనిట్లకు, అలాగే అహ్మదాబాద్‌లో 4,687 నుంచి 1,282లకు, బెంగళూరులో 7,431 నుంచి 1,591లకు , ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 6,188 నుంచి 2,828లకు, చెన్నైలో 4,468 నుంచి 709లకు, కోల్‌కతాలో 3,382 నుంచి 1,253లకు, ముంబైలో 18,574 నుంచి 3,381లకు, పుణేలో 13,725 నుంచి 2,495 యూనిట్లకు పడిపోయాయి. ఈ ఏడాది క్యూ2లో చాలా వరకు రాష్ట్రాలు వైరస్‌ వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ విధించడం, ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో గృహాల సరఫరా, డిమాండ్‌ రెండింట్లోనూ ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ పరిమితులను ఎత్తివేయటం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం కావటంతో జూన్‌ ప్రారంభం నుంచి విక్రయాలలో కదలిక మొదలైందని ధ్రువ్‌ అగర్వాల్‌ తెలిపారు.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు