రిపేరు హక్కు ఉద్యమంలో భాగంగా ఏసీఎంఏ..

10 Mar, 2023 03:28 IST|Sakshi

న్యూఢిల్లీ: వాహనాలను వినియోగదారులు ఎవరిదగ్గరైనా మరమ్మతు చేయించుకునే హక్కును సాధించుకునేందుకు అంతర్జాతీయంగా సాగుతున్న ఉద్యమానికి తాము కూడా మద్దతునిస్తున్నట్లు దేశీ ఆటో విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ వెల్లడించింది. వివరాల్లోకి వెడితే.. వైర్‌లెస్‌ విధానంలో కనెక్టెడ్‌గా ఉంటున్న వాహనాల డేటా అంతా కూడా వాటి తయారీ సంస్థలకు చేరుతోంది. దీంతో వాటికి ఏమైనా రిపేర్లు వస్తే బైట వేరే వారి దగ్గర మరమ్మతు చేయించుకోనివ్వకుండా కంపెనీలు నిరోధించేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. ఫలితంగా వినియోగదారులు తాము కోరుకున్న చోట రిపేరు చేయించుకునే హక్కులకు భంగం కలుగుతోంది.

తప్పనిసరిగా కంపెనీనే ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే రిపేర్‌ హక్కుల ఉద్యమం తెరపైకి వచ్చింది. వారంటీ వ్యవధి ముగిసిపోయిన వాహనాలకు వచ్చే మరమ్మతుల్లో 70 శాతం భాగాన్ని స్వతంత్ర రిపేర్‌ షాపులే చేస్తున్నాయి. కొనుగోలు అనంతర సేవలకు సంబంధించిన ఆఫ్టర్‌మార్కెట్‌ విభాగం దేశీయంగా 10.1 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో వినియోగదారులు కోరుకుంటున్న రిపేర్‌ హక్కులకు మద్దతునిస్తున్న ఇతర అంతర్జాతీయ సంస్థలతో పాటు తామూ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు ఏసీఎంఏ తెలిపింది. రైట్‌ టు రిపేర్‌ కింద దేశీయంగానూ చట్టం తీసుకొస్తే భారత్‌లో ఆఫ్టర్‌మార్కెట్‌ విభాగం మరింతగా విస్తరించగలదని పేర్కొంది. అంతర్జాతీయంగా అమెరికాలో ఈ ఉద్యమం మొదలైంది. 

మరిన్ని వార్తలు