బడా టెక్‌ కంపెనీల నియంత్రణలో వైఫల్యం: కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు    

13 Dec, 2022 08:50 IST|Sakshi

 దీంతో సమాజానికి నష్టం 

కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్‌  

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా బడా టెక్నాలజీ కంపెనీల ఆవిష్కరణలకు సంబంధించి సరైన నియంత్రణల రూప కల్పనలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని, ఫలితంగా సమాజానికి నష్టం వాటిల్లుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు. ఫిక్కీ నిర్వహించిన ఇంటర్నెట్‌ గవర్నెన్స్‌ ఫోరమ్‌ (ఐజీఎఫ్‌) కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు.

మంచి కోసం ఆవిష్కృతమైన ఇంటర్నెట్‌.. ఇప్పుడు రిస్క్‌గా మారిందని, యూజర్లకు హాని కలిగించడంతోపాటు, నేరాలకు నిలయమైనట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, ఐజీఎఫ్, పేరొందిన వేదికలు.. ఈ పెద్ద టెక్నాలజీ సంస్థలు చేయాల్సిన, చేయకూడని వాటి విషయంలో, అవసరమైన నిబంధనలు తీసుకురావడంలో వెనుకబడినట్టు చెప్పారు. ‘‘మనం చాలా కాలంగా వీటిని ఆవిష్కర్తలుగా, ఆవిష్కరణలుగా చూశాం. అంతేకానీ, ఆ ఆవిష్కరణలు హాని కలిగించొచ్చని, సమాజంలో, ప్రజల్లో ఇతర నష్టాలకు దారితీయగలవని గుర్తించలేకపోయాం’’అని మంత్రి పేర్కొన్నారు.

దేశంలో 120 కోట్ల మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నందున భద్రత, విశ్వసనీయ అన్నవి ప్రభుత్వానికి ముఖ్యమైన పరిష్కరించాల్సిన అంశాలుగా చెప్పారు. ‘‘పెద్దలు, విద్యార్థులు, పిల్లలు, మహిళలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. కనుక ప్రభుత్వం వైపు నుంచి చూస్తే ఆన్‌లైన్‌లో భద్రత, విశ్వసనీయత, జవాబుదారీ అన్నవి ఎంతో ముఖ్యమైన విధానపరమైన అంశాలు’’అని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు