వెంకీ మామా.. కొత్త బిజినెస్‌ అదిరిపోయిందిగా!

10 Jan, 2022 16:35 IST|Sakshi

టాలీవుడ్ ఇండస్ట్రీ అగ్ర హీరోలలో ఒకరైన వెంకటేష్ దగ్గుబాటి కొత్త బిజినెస్‌లోకి అడుగు పెట్టాడు. ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) స్టార్టప్ బైక్ వో టాలీవుడ్ హీరో వెంకటేష్ దగ్గుబాటితో భాగస్వామ్యం ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. బైక్ వో అనేది ఈవీ టూ వీలర్ స్మార్ట్ హబ్ నెట్ వర్క్. ఈ కంపెనీ 2025 నాటికి దేశవ్యాప్తంగా 20,000 ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఇన్స్టాల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

"బైక్ వో అనేది ఈవీ రంగంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఛార్జింగ్, సర్వీసింగ్ వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది" అని విక్టరీ వెంకటేష్ తెలిపారు. ఈ భాగస్వామ్యంతో బైక్ వో తన ఈవీ సర్వీసింగ్, ఛార్జింగ్ నెట్ వర్క్ విస్తరిస్తుంది. మార్కెటింగ్, బ్రాండ్ ప్రమోషన్ కార్యకలాపాల కోసం తనను వినియోగించుకోనుంది. ఇటీవల కాలంలో చాలా మంది హీరోలు ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. గతంలో టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హైదరాబాద్‌కు చెందిన వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీని విజయ్ మద్దూరి, కేదార్ సెలగంశెట్టి, వంశీ కారు మంచి నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రిక్ వెహికిల్ సమిట్‌లో ఈ కంపెనీ తమ బిజినెస్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. వాట్స్ అండ్ వోల్ట్స్ కంపెనీ అందించే ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లను నగరవాసులు అద్దె చెల్లించి ఉపయోగించుకోవచ్చు.

(చదవండి: కంపెనీలో ఫుడ్‌ సర్వ్‌ చేసేవాడు..! ఇప్పుడు ఆ ఒక్కటే అంబానీనే దాటేలా చేసింది..!)

మరిన్ని వార్తలు