కృష్ణపట్నం.. అదానీ పరం

6 Apr, 2021 04:12 IST|Sakshi

పోర్టులో 100 శాతం వాటా కొనుగోలు చేసిన ఏపీసెజ్‌

విశ్వ సముద్ర హోల్డింగ్స్‌ నుంచి 25 శాతం వాటాకు రూ.2,800 కోట్ల చెల్లింపు

ఇప్పటికే 75 శాతం వాటాను రూ.12,000 కోట్లకు దక్కించుకున్న అదానీ పోర్ట్స్‌

2025 నాటికి కృష్ణపట్నం పోర్టు సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటన

ఆదాయంలో 2.6% రాష్ట్ర వాటా కొనసాగుతుంది: ఏపీ మారిటైమ్‌ బోర్డు

సాక్షి, అమరావతి: కృష్ణపట్నం పోర్టులో పూర్తిగా 100 శాతం వాటాను అదానీ గ్రూపు కైవసం చేసుకుంది. ఇప్పటికే 75 శాతం వాటాను కలిగి ఉన్న అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (ఏపీసెజ్‌) తాజాగా మిగిలిన 25 శాతం వాటాను కొనుగోలు చేసింది. కృష్ణపట్నం పోర్టులో విశ్వ సముద్ర హోల్డింగ్స్‌కు చెందిన 25 శాతం వాటాను రూ.2,800 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఏపీసెజ్‌ సోమవారం స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లకు తెలియచేసింది.

దీంతో కృష్ణపట్నం పోర్టులో వాటా 75 శాతం నుంచి 100 శాతం వరకు చేరినట్లు తెలిపింది. గతేడాది అక్టోబర్‌ నెలలో 75 శాతం వాటాను కొనుగోలు చేసినప్పుడు ఆర్థిక ఏడాది 2021 ఎబిట్టాకు(చెల్లించాల్సిన పన్నులు, వడ్డీలు, తరుగుదల వంటివన్నీ లెక్కలోకి తీసుకొని లెక్కించే ఆదాయం)  10.3 రెట్లు అధికంగా కృష్ణపట్నం పోర్టు విలువను రూ.13,765 కోట్లుగా మదింపు వేసినట్లు తెలిపింది.  గడిచిన ఆర్థిక సంవత్సరంలో 38 మిలియన్‌ టన్నుల వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా రూ.1,840 కోట్ల ఆదాయం, ఎబిట్టా రూ.3,125 కోట్లుగా పేర్కొంది.  

విస్తరణ దిశగా కృష్ణపట్నం పోర్టు
ప్రస్తుతం 64 మిలియన్‌ టన్నుల సామర్థ్యం కలిగివున్న కృష్ణపట్నం పోర్టును భారీగా విస్తరించనున్నట్లు ఏపీసెజ్‌ సీఈవో కరన్‌ అదాని తెలిపారు. 2025 నాటికి ప్రస్తుత పోర్టు సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. డీప్‌వాటర్‌ పోర్టు కావడం, 6,800 ఎకరాలు ఉండటం మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం పోర్టు సామర్థ్యం 300 మిలియన్‌ టన్నుల వరకు తీసుకువెళ్లే అవకాశం ఉండటం కలిసొచ్చే అంశాలుగా పేర్కొన్నారు. దక్షిణాంధ్రప్రదేశ్‌కు కృష్ణపట్నం పోర్టును ముఖద్వారంగా తీర్చిదిద్దుతామని, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు ఇది ఎంతో కీలకంకానుందని చెప్పారు.

తూర్పు తీరంపై ప్రత్యేక దృష్టి
2025 నాటికి ఏపీసెజ్‌ నిర్వహణ సామర్థ్యం 500 మిలియన్‌ టన్నులకు తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో తూర్పు తీర ప్రాంతంపై అదానీ గ్రూపు ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా తమిళనాడులో కట్టపల్లి, ఎన్నోర్‌ పోర్టులను కొనుగోలు చేసిన అదానీ, మన రాష్ట్రంలో కృష్ణపట్నం, గంగవరం పోర్టులను కొనుగోలు చేసింది. కృష్ణపట్నం పోర్టులో 100 శాతం వాటా కొనుగోలు రూ.14,800 కోట్లు వ్యయం చేయగా, గంగవరం పోర్టులో 89.6 శాతం వాటాను రూ.5554 కోట్లకు కొనుగోలు చేసింది. అదాని గ్రూపు రాష్ట్రంలోని ఈ రెండు పోర్టులో కొనుగోలు చేయడం కోసం రూ.20,354 కోట్లు వ్యయం చేసింది.

రాష్ట్ర ఆదాయంలో మార్పు ఉండదు
కృష్ణపట్నం పోర్టులో ఏపీసెజ్‌ 100 శాతం వాటాను కొనుగోలు చేసినా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో ఎటువంటి ప్రభావం చూపదని ఏపీ మారిటైమ్‌ బోర్డు స్పష్టం చేసింది. కృష్ణపట్నం పోర్టు ఆదాయంలో 2.6 శాతం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తుందని, ఇప్పుడు 100 శాతం వాటా తీసుకున్నా అదే మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని ఏపీ మారిటైమ్‌ బోర్డు సీఈవో మురళీథరన్‌ ‘సాక్షి’కి తెలిపారు.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు