అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీఓ ఓకే 

1 Feb, 2023 03:36 IST|Sakshi

పూర్తిస్థాయిలో బిడ్స్‌ దాఖలు 

4.55 కోట్ల షేర్లకు 5.08 కోట్ల బిడ్స్‌ 

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ డైవర్సిఫైడ్‌ దిగ్గజం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ) విజయవంతమైంది. మంగళవారం(31) చివరిరోజుకల్లా పూర్తిస్థాయిలో బిడ్స్‌ దాఖలయ్యాయి. కంపెనీ 4.55 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. స్టాక్‌ ఎక్సే్ఛంజీల గణాంకాల ప్రకారం 5.08 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. నాన్‌రిటైల్‌ ఇన్వెస్టర్లు ప్రధానంగా భారీ సంఖ్యలో బిడ్స్‌ దాఖలు చేయడం ఇందుకు సహకరించింది.

నాన్‌ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు 96.16 లక్షల షేర్లను రిజర్వ్‌ చేయగా.. మూడు రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. ఇక అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్‌) విభాగంలో 1.28 కోట్ల షేర్లు ఆఫర్‌ చేయగా.. 1.2 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలయ్యాయి. అయితే రిటైల్‌ ఇన్వెస్టర్లు, కంపెనీ ఉద్యోగుల నుంచి అంతంతమాత్ర స్పందనే లభించినట్లు బీఎస్‌ఈ గణాంకాలు వెల్లడించాయి.

రిటైలర్లకు 2.29 కోట్ల షేర్లు కేటాయించగా.. 12 శాతానికే దరఖాస్తులు వచ్చాయి. ఉద్యోగులకు పక్కనపెట్టిన 1.62 లక్షల షేర్లకుగాను 55 శాతానికే స్పందన లభించింది. ఎఫ్‌పీవోకింద కంపెనీ మొత్తం 6.14 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయగా.. యాంకర్‌ ఇన్వెస్టర్లుసహా ఇతరుల నుంచి 6.45 కోట్ల షేర్లకు డిమాండ్‌ నమోదైంది. 

షేరు అప్‌ 
ఎఫ్‌పీవో ధరల శ్రేణి రూ. 3,112–3,276కాగా.. ఇష్యూ ముగింపు నేపథ్యంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు బీఎస్‌ఈలో 3.35 శాతం బలపడి రూ. 2,975 వద్ద ముగిసింది. గత వారం కంపెనీ యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 5,985 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 33 ఫండ్స్‌కు 1.82 కోట్ల షేర్లను కేటాయించింది.

షేరుకి రూ. 3,276 ధరలో జారీ చేసింది. షేర్లను కొనుగోలు చేసిన విదేశీ ఇన్వెస్టర్ల జారబితాలో అబు ధాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అధారిటీ, బీఎన్‌పీ పరిబాస్‌ ఆర్బిట్రేజ్, సొసైటీ జనరాలి, గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (మారిషస్‌), మోర్గాన్‌ స్టాన్లీ ఏషియా(సింగపూర్‌), నోమురా సింగపూర్, సిటీగ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ మారిషన్‌ తదితరాలున్నాయి.

యాంకర్‌బుక్‌లో దేశీ దిగ్గజాలు ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ ఎంప్లాయీ పెన్షన్‌ ఫండ్‌ తదితరాలున్నాయి. ఎఫ్‌పీవో నిధుల్లో రూ. 10,689 కోట్లను గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులు, ప్రస్తుత ఎయిర్‌పోర్టుల పనులు, గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం తదితరాలకు వినియోగించనుంది.   

మరిన్ని వార్తలు