అదానీ గ్రూప్‌ చేతికి ఎన్‌డీటీవీ.. మరి మాతో చర్చించ లేదు!

24 Aug, 2022 03:38 IST|Sakshi

వాటాదారులకు ఓపెన్‌ ఆఫర్‌ 

26 శాతం వాటా కొనుగోలుకి రెడీ 

రూ. 294 ధరలో రూ. 493 కోట్లు వెచ్చింపు 

మెజారిటీ వాటావైపు అదానీ అడుగులు 

అటు సంపదలోనూ, ఇటు విభిన్న వ్యాపార విస్తరణలోనూ పోటీ పడుతున్న కార్పొరేట్‌ దిగ్గజాలు ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ తాజాగా మీడియా విభాగంలోనూ సై అంటున్నారు. రుణాలను ఈక్విటీగా మార్పు చేసుకోవడం ద్వారా ఎన్‌డీటీవీలో 29 శాతానికిపైగా వాటాను అదానీ గ్రూప్‌ సొంతం చేసుకుంది. మెజారిటీ వాటాపై కన్నేసింది. ఇప్పటికే బ్రాడ్‌క్యాస్టింగ్‌ సంస్థ నెట్‌వర్క్‌ 18ను ముకేశ్‌ అంబానీ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే!! 

న్యూఢిల్లీ: వార్తా చానళ్ల మీడియా సంస్థ న్యూఢిల్లీ టెలివిజన్‌ లిమిటెడ్‌(ఎన్‌డీటీవీ)లో మెజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు ప్రయివేట్‌ రంగ దిగ్గజం అదానీ గ్రూప్‌ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా సాధారణ వాటాదారుల నుంచి 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందుకు షేరుకి రూ. 294 ధరను నిర్ణయించింది. తద్వారా రూ. 4 ముఖ విలువగల దాదాపు 1.68 కోట్ల షేర్లను చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఇందుకు రూ. 493 కోట్లు వెచ్చించనుంది. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనలకంటే ఆఫర్‌ ధర అధికమని ఈ సందర్భంగా కంపెనీ పేర్కొంది. ఎన్‌ఎస్‌ఈలో ఎన్‌డీటీవీ షేరు సోమవారం ముగింపు ధర రూ. 359కాగా.. ఈ వార్తల నేపథ్యంలో మంగళవారం షేరుకి భారీ డిమాండ్‌ నెలకొంది. దీంతో 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి (రూ. 18 లాభపడి) రూ. 377 వద్ద ముగిసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ఓపెన్‌ ఆఫర్‌ ధర కంటే 28% అధికం! 

55 శాతానికి 
ఎన్‌డీటీవీలో వారంట్ల మార్పిడి ద్వారా అదానీ గ్రూప్‌ దాదాపు 30% వాటాను సొంతం చేసుకుంది. దీంతో పబ్లిక్‌ నుంచి మరో 26% వాటా కొనుగోలుకి ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ విజయవంతమైతే ఎన్‌డీటీవీలో 55%పైగా వాటాను అదానీ గ్రూప్‌ పొందే వీలుంది. ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్‌కు పూర్తి అనుబంధ సంస్థ విశ్వప్రధాన్‌ కమర్షియల్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌(వీసీపీఎల్‌) వారంట్లను మార్పిడి చేసుకోవడం ద్వారా ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్‌ ప్రయివేట్‌లో 99.5% వాటాను చేజిక్కించుకుంది. దీంతో ఎన్‌డీటీవీలో ఆర్‌ఆర్‌పీఆర్‌కు గల 29.18% వాటాను పొందింది. ఎన్‌డీటీవీ ప్రమోటర్‌ కంపెనీ ఆర్‌ఆర్‌పీఆర్‌. వెరసి వీసీపీఎల్‌తో పాటు అదానీ మీడియా నెట్‌వర్క్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఉమ్మడిగా ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించాయి. 26% వాటాకు సమానమైన 1,67,62,530 షేర్లను వాటాదారుల నుంచి కొనుగోలు చేయనున్నాయి.  ఎన్‌డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్‌ రాయ్, రాధికా రాయ్‌లకు సంస్థలో సంయుక్తంగా 32.26% వాటా ఉంది. కాగా.. అదానీ గ్రూప్‌ రూ. 114 కోట్లకు కొనుగోలు చేసిన వీసీపీఎల్‌ గతంలో ముకేశ్‌ అంబానీ గ్రూప్‌  సంస్థ కావడం కొసమెరుపు! 

మాతో చర్చించ లేదు 
వారంట్ల మార్పిడి ద్వారా ఆర్‌ఆర్‌పీఆర్‌లో వాటా చేజిక్కించుకున్న విషయంపై ప్రమోటర్లతో వీసీపీఎల్‌ చర్చించలేదు. అనుమతి కోరలేదు. ఈ విషయం వీసీపీఎల్‌ జారీ నోటీసు ద్వారా ఈరోజే ప్రమోటర్లకు తెలిసింది. వాటా విక్రయించేందుకు ప్రమోటర్లు ఎవరితోనూ చర్చించడంలేదు’. 
    – ఎన్‌డీటీవీ

>
మరిన్ని వార్తలు