అదానీ గ్రీన్‌- వొడాఫోన్‌ ఐడియా జూమ్

2 Sep, 2020 12:15 IST|Sakshi

ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్‌ పవర్‌ కంపెనీగా ఆవిర్భావం

10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌- సరికొత్త గరిష్టానికి అదానీ గ్రీన్‌ ఎనర్జీ

నిధుల సమీకరణ బాటలో ప్రమోటర్లు -8 శాతం ఎగసిన వొడాఫోన్‌ ఐడియా

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా అదానీ గ్రీన్‌ ఎనర్జీ కౌంటర్‌తోపాటు.. మొబైల్‌ సేవల కంపెనీ వొడాఫోన్‌ ఐడియా కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

అదానీ గ్రీన్‌ ఎనర్జీ
గ్లోబల్‌ సోలార్‌ విద్యుదుత్పత్తిలో అదానీ గ్రూప్‌.. ప్రపంచ నంబర్‌వన్‌గా ఆవిర్భవించినట్లు మెర్కామ్‌ క్యాపిటల్‌ తాజాగా పేర్కొంది. నిర్వహణ, నిర్మాణంలో ఉన్న యూనిట్లతోపాటు.. ఇంతవరకూ దక్కించుకున్న ప్రాజెక్టుల రీత్యా అదానీ గ్రూప్‌ టాప్‌ ర్యాంకులో నిలుస్తున్నట్లు వివరించింది. యూఎస్‌లో 2019లో ఏర్పాటైన మొత్తం సౌర విద్యుత్‌ సామర్థ్యంకంటే అదానీ గ్రూప్‌ పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియో అధికమని మెర్కామ్‌ తెలియజేసింది. అంతర్జాతీయ స్థాయిలో సోలార్‌ సెల్స్‌, మాడ్యూల్స్‌ తయారీతోపాటు.. పూర్తిస్థాయిలో సమీకృత సౌర విద్యుదుత్పత్తి కంపెనీగా అదానీ గ్రూప్‌ నిలుస్తున్నట్లు అభిప్రాయపడింది. జీవిత కాలంలో ఈ ప్రాజెక్టుల ద్వారా 1.4 బిలియన్‌ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలదని అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి జూన్‌లో 8 గిగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుల కాంట్రాక్టులను అదానీ గ్రీన్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 2.5 గిగావాట్‌ విద్యుత్‌ సామర్థ్యాన్ని గ్రూప్‌ కలిగి ఉన్నట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అదానీ గ్రీన్‌ ఎనర్జీకి డిమాండ్ పెరిగింది. వెరసి ఎన్‌ఎస్‌ఈలో షేరు 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది.  రూ. 544 వద్ద ఫ్రీజయ్యింది. ఇది సరికొత్త గరిష్టంకావడం విశేషం! 

వొడాఫోన్‌ ఐడియా
నిధుల సమీకరణ సన్నాహాల్లో ఉన్నట్లు తాజాగా మొబైల్‌ సేవల కంపెనీ వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. ఇందుకు ఈ నెల 4న(శుక్రవారం) బోర్డు సమావేశంకానున్నట్లు తెలియజేసింది. పబ్లిక్‌ ఇష్యూ, ప్రిఫరెన్షియల్‌ కేటాయింపు, ప్రయివేట్‌ ప్లేస్‌మెంట్‌ తదితర మార్గాలలో నిధుల సమీకరణపై బోర్డు చర్చించనున్నట్లు వెల్లడించింది. ఏజీఆర్‌ బకాయిల చెల్లింపులపై సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ అంశానికిప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో వొడాఫోన్‌ ఐడియా షేరు 8 శాతం జంప్‌చేసి రూ. 9.5 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ.  10.15 వరకూ ఎగసింది.

>
మరిన్ని వార్తలు