ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ‘అదానీ’ ల్యాండింగ్‌!

25 Aug, 2020 04:46 IST|Sakshi

జీవీకే చేజారనున్న కీలక విమానాశ్రయం

74 శాతం వాటాలపై అదానీ గ్రూప్‌ కన్ను

కొనసాగుతున్న చర్చలు...

జీవీకే గ్రూప్‌ ప్రస్తుత వాటా 50.5 శాతం

న్యూఢిల్లీ: రుణ భారంతో పాటు ఆర్థిక అవకతవకలపై సీబీఐ విచారణతో సతమతమవుతున్న ఇన్‌ఫ్రా దిగ్గజం జీవీకే గ్రూప్‌ తాజాగా ప్రతిష్టాత్మక ముంబై విమానాశ్రయ ప్రాజెక్టు నుంచి నిష్క్రమించనున్నట్లు తెలుస్తోంది. పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్‌ ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు (ఎంఐఏఎల్‌)లో మెజారిటీ వాటాలను కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎంఐఏఎల్‌లో జీవీకే గ్రూప్‌నకు ఉన్న 50.5 శాతం వాటాలతో పాటు మైనారిటీ భాగస్వాములైన ఎయిర్‌పోర్ట్స్‌ కంపెనీ సౌతాఫ్రికా (ఏసీఎస్‌ఏ), బిడ్‌వెస్ట్‌ గ్రూప్‌ నుంచి మరో 23.5 శాతం వాటాలను అదానీ గ్రూప్‌ కొనుగోలు చేయనుంది.

ఇందుకు సంబంధించి జీవీకే, అదానీ గ్రూప్‌ల మధ్య ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిగినట్లు, అంతిమంగా ముంబై ఎయిర్‌పోర్ట్‌ నుంచి జీవీకే నిష్క్రమించే అవకాశాలే ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్‌పై పలు టీమ్‌లు కసరత్తు చేస్తున్నాయని, మరికొద్ది వారాల వ్యవధిలోనే ప్రాథమిక వివరాలను ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. సుమారు రూ. 705 కోట్లు నిధులు పక్కదారి పట్టించిందన్న ఆరోపణల మీద జీవీకే గ్రూప్‌పై సీబీఐ విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఈ డీల్‌ వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  

గతేడాది నుంచే అదానీ కసరత్తు ..
ఎంఐఏఎల్‌లో జీవీకే గ్రూప్‌నకు 50.5 శాతం, బిడ్‌ సర్వీసెస్‌ డివిజన్‌ మారిషస్‌ (బిడ్‌వెస్ట్‌)కు 13.5 శాతం, ఎయిర్‌పోర్ట్స్‌ కంపెనీ సౌతాఫ్రికాకు 10 శాతం, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు (ఏఏఐ)కు 26 శాతం వాటాలు ఉన్నాయి. బిడ్‌వెస్ట్‌ వాటాలను అదానీ గ్రూప్‌ గతేడాది మార్చిలో రూ. 1,248 కోట్లకు కొనుగోలు చేయాలని ప్రయత్నించింది. అయితే, ఈ విషయంలో ముందుగా తమకే అధికారం ఉంటుందంటూ జీవీకే గ్రూప్‌ ఈ డీల్‌ను అడ్డుకుంది. కానీ, బిడ్‌వెస్ట్‌ వాటా కొనుగోలు చేసేంత స్థాయిలో నిధులను సమకూర్చుకోలేకపోయింది. దీంతో వివాదం కోర్టుకు చేరింది. ప్రస్తుతం జీవీకే గ్రూప్‌ ఆర్థిక పరిస్థితులు గణనీయంగా దిగజారడంతో అదానీ గ్రూప్‌నకు తన వాటా కూడా అమ్మేసి వైదొలిగే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  

పోర్టుల నుంచి ఎయిర్‌పోర్టుల వరకూ..
నౌకాశ్రయాల నుంచి విమానాశ్రయాల దాకా అదానీ గ్రూప్‌ భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరిస్తోంది. లక్నో, జైపూర్, గువాహటి, అహ్మదాబాద్, తిరువనంతపురం, మంగళూరులో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ నిర్మించిన 6 నాన్‌–మెట్రో ఎయిర్‌పోర్టుల నిర్వహణ కాంట్రాక్టులను దక్కించుకుంది. ఇక ఎంఐఏఎల్‌ను కూడా దక్కించుకుంటే ప్రభుత్వ రంగ ఏఏఐ మినహా ప్రైవేట్‌ రంగంలో అతిపెద్ద విమానాశ్రయాల ఆపరేటర్‌గా అదానీ నిలవనుంది. అంతర్జాతీయ స్థాయి ఇన్‌ఫ్రాతో విమానశ్రయాలను అభివృద్ధి చేయడం ద్వారా దేశంలోనే అతి పెద్ద ఎయిర్‌పోర్ట్‌ డెవలపర్‌గా ఎదగాలని భారీ లక్ష్యం నిర్దేశించుకున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఇటీవలే తన వార్షిక నివేదికలో వెల్లడించింది. తాజా డీల్‌ ఆ లక్ష్య సాధనకు తోడ్పడనుంది.

గట్టెక్కేందుకు జీవీకే ప్రయత్నాలు..
రుణభారంతో సతమతమవుతున్న జీవీకే గ్రూప్‌ తమ జీవీకే ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌లో 79 శాతం వాటాలను విక్రయించేందుకు గతేడాది అక్టోబర్‌లో అబు దాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ (ఏడీఐఏ), కెనడాకు చెందిన పబ్లిక్‌ సెక్టార్‌ పెన్షన్‌ (పీఎస్‌పీ) ఇన్వెస్ట్‌మెంట్స్, ప్రభుత్వ రంగ నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (ఎన్‌ఐఐఎఫ్‌)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ విలువ సుమారు రూ. 7,614 కోట్లు. ఈ నిధులను హోల్డింగ్‌ కంపెనీల రుణభారాన్ని తగ్గించుకునేందుకు వినియోగించుకోవాలని జీవీకే గ్రూప్‌ భావించింది. అయితే, ఈ డీల్‌ పూర్తయిందా లేదా అనేది ఇప్పటికీ వెల్లడి కాలేదు. ప్రస్తుతం మాత్రం ఎంఐఏఎల్‌లో వాటాలను అమ్ముకునేందుకు జీవీకే ప్రమోటర్లకు కాస్త వెసులుబాటు ఇచ్చేందుకు ఎన్‌ఐఐఎఫ్, ఏడీఐఏ, పీఎస్‌పీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అంగీకరించినట్లు సమాచారం.

ఎంఐఏఎల్‌ ఖాతాల ఆడిట్‌ ..
జీవీకే హోల్డింగ్స్‌పై సీబీఐ విచారణ నేపథ్యంలో ఎంఏఐఎల్‌కు చెందిన గడిచిన 10 సంవత్సరాల ఖాతాలను ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయించాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ నిర్ణయించింది. ఇందుకోసం డెలాయిట్‌ సంస్థను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. కంపెనీకి రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్షియానికి ఎస్‌బీఐ సారథ్యం వహిస్తోంది. చట్టప్రకారం మోసం ఆరోపణలపై ఎస్‌బీఐ కూడా విచారణ జరపాల్సి ఉంటుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు