Adani: మీడియా వ్యాపారంలోకి అదానీ

2 Mar, 2022 10:38 IST|Sakshi

న్యూఢిల్లీ: విభిన్న రంగాల్లో ఉన్న అదానీ గ్రూప్‌ తాజాగా మీడియా వ్యాపారంలోకి ప్రవేశించింది. క్వింటిల్లియన్‌ బిజినెస్‌ మీడియాలో (క్యూబీఎం) మైనారిటీ వాటాను అదానీ కైవసం చేసుకుంది. ఎంత వాటా, చెల్లించిన మొత్తాన్ని కంపెనీ వెల్లడించలేదు. క్వింటిల్లియన్‌ బిజినెస్‌ మీడియాలో వాటా కోసం బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీ అయిన క్వింట్‌ డిజిటల్‌ మీడియాతో అవగాహన ఒప్పందం కుదిరింది. 

బిజినెస్, ఫైనాన్షియల్‌ న్యూస్‌ కంపెనీ అయిన క్యూబీఎం.. బిజినెస్‌ వార్తలను అందిస్తున్న డిజిటల్‌ వేదిక బ్లూమ్‌బర్గ్‌ క్వింట్‌ను బ్లూమ్‌బర్గ్‌తో కలిసి నిర్వహిస్తోంది. అదానీ ప్రవేశించిన వెంటనే యూఎస్‌కు చెందిన బ్లూమ్‌బర్గ్‌ మీడియా క్యూబీఎంను విడిచిపెట్టింది. భారతదేశంలో క్యూబీఎమ్‌తో ఈక్విటీ జాయింట్‌ వెంచర్‌ను ముగిస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే బ్లూమ్‌బర్గ్‌ వాటాను అదానీ కొనుగోలు చేసిందా అన్న అంశంలో స్పష్టత లేదు. 

క్యూబీఎంకు మాత్రమే ఈ డీల్‌ పరిమితమని, క్వింట్‌ డిజిటల్‌కు చెందిన ద క్వింట్, క్విన్‌టైప్‌ టెక్నాలజీస్, ద న్యూస్‌ మినిట్, యూత్‌ కీ ఆవాజ్‌కు సంబంధం లేదని అదానీ స్పష్టం చేసింది. మీడియాలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్న అదానీ గ్రూప్‌.. తన మీడియా సంస్థకు సారథిగా ప్రముఖ జర్నలిస్ట్‌ సంజయ్‌ పుగాలియాను నియమించుకుంది. క్వింట్‌ డిజిటల్‌ మీడియా ప్రెసిడెంట్‌ గా సంజయ్‌ గతంలో పనిచేశారు. ప్రస్తుతం ఆయన అదానీ మీడియా వెంచర్స్‌ సీఈవోగా ఉన్నారు.   
 

మరిన్ని వార్తలు