అదానీ గ్రూప్‌ సరికొత్త రికార్డ్‌ 

7 Apr, 2021 00:18 IST|Sakshi

100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చోటు  

ముంబై: బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ గ్రూప్‌ తాజాగా 100 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ)ను సాధించింది. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే మార్కెట్‌ విలువ రీత్యా గ్రూప్‌ చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. అంతేకాకుండా దేశీయంగా ఇంత విలువను అందుకున్న మూడో గ్రూప్‌గా ఆవిర్భవించింది. ఇప్పటివరకూ టాటా గ్రూప్, ముకేశ్‌ అంబానీ దిగ్గజం.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మాత్రమే 100 బిలియన్‌ డాలర్ల విలువను అధిగమించాయి. ప్రస్తుతం టాటా గ్రూప్‌ మార్కెట్‌ విలువ 242 బిలియన్‌ డాలర్లుకాగా.. ఆర్‌ఐఎల్‌ విలువ 171 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అదానీ గ్రూప్‌ తాజా రికార్డు సాధనకు ఆరు లిస్టెడ్‌ కంపెనీలు సహకరించాయి.  

జోరు తీరిలా 
స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన ఆరు అదానీ గ్రూప్‌ కంపెనీలలో నాలుగు మంగళవారం(6న) ట్రేడింగ్‌లో సరికొత్త గరిష్టాలను తాకాయి. ఫలితంగా అదానీ గ్రూప్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ. 7.84 లక్షల కోట్లు పెరిగి 106.8 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 7.4 శాతం దూసుకెళ్లి రూ. 1,223 సమీపంలో ముగిసింది. తొలుత రూ. 1,241 వద్ద రికార్డ్‌ గరిష్టానికి చేరింది. ఇక అదానీ టోటల్‌ గ్యాస్‌ ఇంట్రాడేలో రూ. 1,250కు చేరింది. చివరికి 4 శాతం లాభపడి రూ. 1209 వద్ద స్థిరపడింది. అదానీ ట్రాన్స్‌మిషన్‌ ఒక దశలో 5 శాతం జంప్‌చేసి రూ. 1,145కు చేరినప్పటికీ.. రూ. 1,110 వద్ద నిలిచింది. అదానీ పోర్ట్స్‌ 14.5 శాతం పురోగమించి రూ. 850 వద్ద ముగిసింది. రూ. 853 సమీపంలో రికార్డ్‌ ‘హై’ని చేరింది. అదానీ పవర్‌ 5 శాతం ఎగసి రూ. 98.4 వద్ద నిలవగా.. అదానీ గ్రీన్‌ ఎనర్జీ 3.3 శాతం లాభంతో రూ. 1,203 వద్ద స్థిరపడింది. అదానీ గ్రీన్, అదానీ పవర్‌ మినహా మిగిలిన నాలుగు కౌంటర్లూ ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టాలను తాకాయి. ప్రస్తుతం అదానీ పవర్‌ మార్కెట్‌ విలువ రూ. 37,9852 కోట్లుకాగా.. మిగిలిన ఐదు కంపెనీలూ రూ. లక్ష కోట్ల మార్క్‌ను అధిగమించడం విశేషం!  

డైవర్సిఫైడ్‌ దిగ్గజం..
పోర్టులు, ఇంధనం తదితర విభిన్న రంగాలలో కార్యకలాపాలు విస్తరించిన అదానీ గ్రూప్‌ 1980 ప్రాంతంలో కమోడిటీస్‌ ట్రేడర్‌గా సేవలు అందించేది. ఆపై రెండు దశాబ్దాల కాలంలో ప్రమోటర్‌ గౌతమ్‌ అదానీ గ్రూప్‌ కార్యకలాపాలను గనులు, పోర్టులు, విద్యుత్‌ ప్లాంట్లు, విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, సిటీ గ్యాస్, రక్షణ రంగాల్లోకి విస్తరించారు. గత రెండేళ్లలో గ్రూప్‌ ఏడు ఎయిర్‌పోర్టుల నిర్వహణను చేపట్టింది.   పునరుత్పాదక ఇంధన విభాగంలో వేగంగా విస్తరిస్తోంది. అదానీ గ్రీన్‌ ద్వారా 2025కల్లా 25 గిగావాట్ల సామర్థ్యాన్ని అందుకోవాలని చూస్తోంది. అదానీ పోర్ట్స్‌ దేశీ పోర్టుల పరిశ్రమలో 30% వరకూ నిర్వహిస్తోంది. కృష్టపట్నం పోర్టుకి జతగా ఇటీవల  గంగవరం పోర్టును సైతం సొంతం చేసుకుంది.

మరిన్ని వార్తలు