ఇది నాపై దాడి కాదు.. భారత్‌పై దాడి: హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ ఆరోపణలపై అదానీ స్పందన

30 Jan, 2023 07:15 IST|Sakshi

గాంధీనగర్‌: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన హేయమైన ఆరోపణల్ని బిలియనీర్‌ గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ ఖండించింది. ఈ ఆరోపణలను కేవలం తమ కంపెనీపై మాత్రమే చేసిన దాడి కాదని, దేశం (భారత్‌) పైన, దేశాభివృద్ధికి పాటుపడుతున్న సంస్థలపై దురుద్దేశపూర్వకంగా దాడికి పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ప్రణాళికతో కూడిన దాడిగా అభివర్ణించింది.    

సదరు సంస్థ చేసిన ఆరోపణల్లో అబద్ధం తప్ప మరేమీ కాదు అని అదానీ గ్రూప్‌ పేర్కొంది.ఈ మేరకు 413 పేజీలతో కూడిన ఒక ప్రకటన విడుదల చేసింది. తప్పుడు ఆరోపణలతో తమ గ్రూప్‌ కంపెనీల షేర్ల ధరలు పడగొట్టి.. హిండెన్‌బర్గ్‌ షార్ట్‌ సెల్లింగ్‌ ద్వారా భారీగా లాభపడాలని చూస్తోందని విమర్శించింది.

ఇది నాపై దాడి కాదు.. భారత్‌పై దాడి
ఆర్థిక లాభాలను పొందేందుకు వీలుగా దురుద్దేశ్యంతో తప్పుడు మార్కెట్‌ను సృష్టించడం కోసమే హిండెన్‌బర్గ్‌ ఇలా చేస్తుందని అదానీ గ్రూప్‌ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇది కేవలం గౌతమ్‌ అదానీ సంస్థలపైన చేసిన దాడి కాదని, దేశం, స్వాతంత్ర్యం, సమగ్రత, నాణ్యత, ఆర్ధిక వృద్ధిపై దాడి అని చెప్పింది.  

హిండెన్‌బర్గ్ పై అనుమానం
ఈ సందర్భంగా అదానీ గ్రూప్‌.. హిండెన్‌బర్గ్ విశ్వసనీయత, నైతికతను ప్రశ్నించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ. 20,000 కోట్ల సమీకరణకు చేపట్టిన ఎఫ్‌పీవో శుక్రవారమే(27న) ప్రారంభమైంది. ఇష్యూ మంగళవారం(ఫిబ్రవరి 1న) ముగియనుంది. ఈ నేపథ్యంలో హిండెన్‌బర్గ్ విడుదల చేసిన రిపోర్ట్‌పై అనుమానం వ్యక్తం చేసింది. 

ఆరోపణలు నిరాధారం
హిండెన్‌బర్గ్‌ లేవనెత్తిన 88 ప్రశ్నలలో 65 ప్రశ్నలకు అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లలో పెట్టుబడులు అన్నీ నిబంధనలకు లోబడి ఉన్నాయని తెలిపింది. మిగతా 23 ప్రశ్నల్లో 18 పబ్లిక్‌ షేర్‌హోల్డర్లు, థర్డ్‌ పార్టీలకు సంబంధించినవని వెల్లడించింది. మిగతా ఐదు ప్రశ్నలు నిరాధారమైనవని తెలిపింది. తమ కంపెనీలన్నీ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తున్నట్టు అదానీ గ్రూప్‌ మరోసారి స్పష్టం చేసింది.

చదవండి👉 అదానీకి హిండెన్‌బర్గ్ షాక్‌, మరో బిలియనీర్‌ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు