అదానీ దూకుడు: రూ. 31 వేల కోట్ల ఓపెన్‌ ఆఫర్‌      

27 Aug, 2022 10:44 IST|Sakshi

ఏసీసీ, అంబుజాకు ఓపెన్‌ ఆఫర్‌

26% చొప్పున వాటాల కొనుగోలు 

31,000 కోట్ల వ్యయానికి అదానీ సై  

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం అదానీ గ్రూప్‌ తాజాగా ఏసీసీ లిమిటెడ్, అంబుజా సిమెంట్స్‌ వాటాదారులకు ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. తద్వారా స్విస్‌ దిగ్గజం హోల్సిమ్‌కు చెందిన దేశీ అనుబంధ సంస్థల్లో 26 శాతం చొప్పున వాటాలను కొనుగోలు చేయనుంది. ఇందుకు మొత్తం రూ. 31,000 కోట్లు వెచ్చించనుంది. ఈ ఏడాది మే నెలలో హోల్సిమ్‌ లిమిటెడ్‌ దేశీ బిజినెస్‌ల కొనుగోలుకి అదానీ గ్రూప్‌ 10.5 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ. 84,000 కోట్లు) విలువైన డీల్‌ను కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు గత వారం క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు పొందింది.  

సెప్టెంబర్‌ 9 వరకూ
అంబుజా సిమెంట్స్‌ వాటాదారులకు షేరుకి రూ. 385, ఏసీసీ వాటాదారులకు షేరుకి రూ. 2,300 చొప్పున అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఆఫర్‌ శుక్రవారం(26న) ప్రారంభమై 2022 సెప్టెంబర్‌ 9న ముగియనుంది. వెరసి అంబుజా సిమెంట్స్‌కు చెందిన 51.63 కోట్ల షేర్లు(26 శాతం వాటా) అదానీ గ్రూప్‌ కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 19,880 కోట్లు వెచ్చించనుంది. ఈ బాటలో ఏసీసీకి చెందిన 4.89 కోట్ల షేర్ల కోసం రూ. 11,260 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. డీల్‌లో భాగంగా అంబుజా సిమెంట్స్‌లో 63.19 శాతం వాటాతోపాటు ఏసీసీలో 54.53% వాటాను అదానీ సొంతం చేసుకోనుంది.  ఓపెన్‌ ఆఫర్‌ నేపథ్యంలో అంబుజా సిమెంట్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.5 శాతం బలపడి రూ. 403 వద్ద ముగిసింది. ఇక ఏసీసీ నామమాత్ర లాభంతో రూ. 2,286 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు