అదానీ గ్రూప్‌ చేతికి ఇజ్రాయెల్‌ పోర్టు 

16 Jul, 2022 08:27 IST|Sakshi

హైఫాను దక్కించుకున్న ఏపీసెజ్, గాడోట్‌ గ్రూప్‌ కన్సార్షియం 

 డీల్‌ విలువ రూ. 9,422 కోట్లు  

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌లోని పోర్ట్‌ ఆఫ్‌ హైఫా ప్రైవేటీకరణ టెండర్‌ను దేశీ దిగ్గజం అదానీ గ్రూప్‌లో భాగమైన అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఏపీసెజ్‌), గాడోట్‌ గ్రూప్‌ కన్సారి్టయం దక్కించుకుంది. దీనితో పోర్ట్‌ ఆఫ్‌ హైఫాను నిర్వహించే హైఫా పోర్ట్‌ కంపెనీలో 100 శాతం వాటాల కొనుగోలు హక్కులు కన్సార్షియంకు లభిస్తాయి. ఏపీసెజ్‌ ప్రకటన ప్రకారం ఇందులో అదానీ పోర్ట్స్‌కు 70 శాతం, గాడోట్‌ గ్రూప్‌నకు 30 శాతం వాటాలు ఉంటాయి.

డీల్‌ విలువ 1.18 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 9,422 కోట్లు). ఏపీసెజ్‌ను అంతర్జాతీయంగా లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్‌ కార్యకలాపాలతో పాటు రవాణా దిగ్గజంగా తీర్చిదిద్దే దిశగా ఇది కీలకమైన అడుగని కంపెనీ సీఈవో కరణ్‌ అదానీ పేర్కొన్నారు. భారత్‌కు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల్లో ఒకటైన ఇజ్రాయెల్‌లోనూ, అలాగే యూరప్‌లోని పోర్టుల రంగంలోనూ తమ కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు ఇది తోడ్పడగలదని వివరించారు. హైఫా పోర్టును మరింత అభివృద్ధి చేసేందుకు ఏపీసెజ్‌తో భాగస్వామ్యం ఎంతగానో ఉపయోగపడగలదని గాడోట్‌ సీఈవో ఓఫర్‌ లించెవ్‌స్కీ పేర్కొన్నారు.

కార్గో హ్యాండ్లింగ్‌లో తమకు, పోర్టు కార్యకలాపాల నిర్వహణలో అదానీ గ్రూప్‌నకు అపార అనుభవాలు ఉండటం .. హైఫా పోర్టును మరింత అభివృద్ధి చేసేందుకు ఉపయో గపడుతుందన్నారు. ఇజ్రాయెల్‌లో మూడో అతి పెద్ద నగరమైన హైఫాకి దగ్గర్లో పోర్ట్‌ ఆఫ్‌ హైఫా ఉంది. 2021లో ఇక్కడ 1.46 మిలియన్ల టీఈయూ (ట్వెంటీ ఫుట్‌ ఈక్వివాలెంట్‌ యూనిట్లు) కంటైనర్లను, 2.56 మిలియన్‌ టన్నుల కార్గోనూ హ్యాండిల్‌ చేశారు. మరోవైపు, అదానీ గ్రూప్‌లో రవాణా వ్యాపార విభాగంగా ఏపీసెజ్‌ కొనసాగుతోంది.

   

మరిన్ని వార్తలు