షేర్ల విక్రయంతో అదానీకి నిధులు

3 Mar, 2023 00:35 IST|Sakshi

4 కంపెనీలలో స్వల్ప వాటాలు

రూ. 15,446 కోట్లు సమీకరణ

న్యూఢిల్లీ: లిస్టెడ్‌ కంపెనీలు నాలుగింటిలో స్వల్పంగా వాటాలు విక్రయించినట్లు ప్రయివేట్‌ రంగ డైవర్సిఫైడ్‌ దిగ్గజం అదానీ గ్రూప్‌ తాజాగా పేర్కొంది. తద్వారా 1.87 బిలియన్‌ డాలర్లు(రూ. 15,446 కోట్లు) సమకూర్చుకున్నట్లు వెల్లడించింది. అమెరికా ఈక్విటీ పెట్టుబడుల కంపెనీ జీక్యూజీ పార్టనర్స్‌కు షేర్లను విక్రయించినట్లు తెలియజేసింది.

సెకండరీ మార్కెట్లో బ్లాక్‌ డీల్స్‌ ద్వారా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌(ఏఈఎల్‌), అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌(ఏపీసెజ్‌), అదానీ గ్రీన్‌ ఎనర్జీ(ఏజీఈఎల్‌), అదానీ ట్రాన్స్‌మిషన్‌ లిమిటెడ్‌(ఏటీఎల్‌)లకు చెందిన మైనారిటీ వాటాలను విక్రయించినట్లు అదానీ గ్రూప్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

దేశీ మౌలిక సదుపాయాల రంగ అభివృద్ధి, విస్తరణలో కీలక పెట్టుబడిదారుగా అదానీ గ్రూప్‌ కంపెనీలలో జీక్యూజీ ఇన్వెస్ట్‌ చేసినట్లు తెలియజేసింది. రానున్న నెలల్లో 2 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 16,500 కోట్లు) రుణ చెల్లింపులు చేపట్టవలసి ఉన్న నేపథ్యంలో వాటాల విక్రయం ప్రాధాన్యతను సంతరించుకుంది. గ్రూప్‌ మొత్తం రూ. 2.21 లక్షల కోట్ల రుణ భారాన్ని కలిగి ఉంది. దీనిలో వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24)లోగా 8 శాతం రుణాలను తిరిగి చెల్లించవలసి ఉంది.

ప్రమోటర్ల వాటా ఇలా
అదానీ గ్రూప్‌లోని ప్రధాన కంపెనీలు ఏఈఎల్‌లో ప్రమోటర్లకు 72.6 శాతం వాటా ఉంది. దీనిలో తాజాగా 3.39 శాతం వాటాకు సమానమైన 3.8 కోట్ల షేర్లను జీక్యూజీకి విక్రయించింది. తద్వారా రూ. 5,460 కోట్లు లభించాయి. ఇక ఏపీసెజ్‌లో గల 66% వాటాలో 4.1% వాటాను విక్రయించింది. 8.8 కోట్ల షేర్లకుగాను రూ. 5,282 కోట్లు పొందింది. ఈ బాటలో ఏటీఎల్‌లో 73.9% వాటా కలిగిన అదానీ గ్రూప్‌ 2.5% వాటాకు సమానమైన 2.8 కోట్ల షేర్లను అమ్మింది. రూ. 1,898 కోట్లు అందుకుంది. ఏజీఈఎల్‌లో గల 60.5% వాటాలో 3.5% వాటాను విక్రయించింది.

5.5 కోట్ల షేర్ల ద్వారా రూ. 2,806 కోట్లు లభించాయి. ఈ లావాదేవీలకు జెఫరీస్‌ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌ బ్రోకర్‌గా వ్యవహరించింది. కాగా.. అదానీ గ్రూప్‌ కంపెనీలలో ఇన్వెస్ట్‌ చేసినందుకు ఉత్సాహపడుతున్నట్లు జీక్యూజీ పార్టనర్స్‌ చైర్మన్, సీఐవో రాజీవ్‌ జైన్‌ తెలిపారు. దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా అదానీ కంపెనీలు భారీస్థాయిలో, కీలక మౌలిక సదుపా యాల ఆస్తులను కలిగి ఉండటంతోపాటు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఆయన తరం ఉత్తమ వ్యాపారవేత్తలలో ఒకరిగా గుర్తింపు పొందినట్లు ప్రస్తావించారు.

మరిన్ని వార్తలు