అదానీ–జీవీకే ఎయిర్‌పోర్ట్‌ ఒప్పందానికి సీఐఐ గ్రీన్‌ సిగ్నల్‌

25 Sep, 2020 06:40 IST|Sakshi

న్యూఢిల్లీ: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో జీవీకే ఎయిర్‌పోర్ట్‌ డెవలపర్స్‌కు ఉన్న మెజారిటీ వాటాలను (50.50 శాతం) అదానీ గ్రూప్‌ కొనుగోలు చేయడానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇతరుల ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలగకుండా కొన్ని షరతులకు లోబడి (గ్రీన్‌ చానెల్‌) ఇరు సంస్థల మధ్య ఈ ఒప్పందానికి మార్గం సుగమం అయ్యింది.  ముంబై విమానాశ్రయంలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు ఆగస్టులో అదానీ గ్రూప్‌ తెలిపింది.

ప్రస్తుత ప్రమోటరు జీవీకే సంస్థకు ఇందులో ఉన్న రుణభారాన్ని కొనుగోలు చేసి, ఈక్విటీ కింద మార్చుకోవడంతో పాటు ఇతర మైనారిటీ షేర్‌హోల్డర్ల వాటాలను కూడా దక్కించుకోనున్నట్లు వెల్లడించింది. దీని ప్రకారం జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోల్డింగ్‌ సంస్థ అయిన జీవీకే ఎయిర్‌పోర్ట్‌ డెవలపర్స్‌ (జీవీకే ఏడీఎల్‌) రుణాన్ని అదానీ ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌(ఏఏహెచ్‌) బ్యాంకర్ల నుంచి కొనుగోలు చేయనుంది. స్టాక్‌ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (ఎంఐఏఎల్‌)లో జీవీకే ఏడీఎల్‌కు ఉన్న 50:50% వాటాతో పాటు ఎయిర్‌పోర్ట్స్‌ కంపెనీ ఆఫ్‌ సౌతాఫ్రికా (ఏసీఎస్‌ఏ), బిడ్‌వెస్ట్‌ గ్రూప్‌ సంస్థలకు ఉన్న 23.5# వాటాలను కూడా  (మొత్తం 74%) అదానీ కొనుగోలు చేయనుంది. తద్వారా దేశీయంగా విమానాశ్రయాల నిర్వహణ లో అతి పెద్ద ప్రైవేట్‌ సంస్థగా ఆవిర్భవించనుంది.

మరిన్ని వార్తలు