అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదం: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

2 Mar, 2023 11:02 IST|Sakshi

న్యూఢిల్లీ: అదానీ గ్రూపు - హిండెన్‌బర్గ్‌ వివాదంలో  దేశ సర్వోన్నత న్యాయస్థానం  సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అదానీ గ్రూప్‌లో తీవ్రమైన ఆర్థిక అవకతవకలు జరిగాయని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ నివేదిక బయటపెట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

సెబీ నిబంధనలలోని సెక్షన్ 19 ఉల్లంఘన జరిగిందా, స్టాక్ ధరలలో ఏమైనా అవకతవకలు జరిగాయా అనే దానిపై దర్యాప్తు చేయాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. రెండు నెలల్లో విచారణ జరిపి స్టేటస్ రిపోర్టు సమర్పించాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. రెగ్యులేషన్‌ నిబంధనల ఉల్లంఘన ఉంటే  కచ్చితంగా సెబీ విచారణ చేపట్టాలని సెబీని ఆదేశించింది. అలాగే దీనికి సంబంధించిన విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జ్‌ జస్టిస్‌ సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో మాజీ న్యాయమూర్తులు జేపీ దేవదత్, ఓపీ భట్‌తోపాటు కేవీ కామత్‌, నందన్‌ నీలేకని, సోమశేఖర​ సుందరేశన్‌ ఉన్నారు. ఈ ప్యానెల్‌కు అన్నివిధాలా   సహకారాన్ని అందించాలని కేంద్రం, ఆర్థిక చట్టబద్ధమైన సంస్థలు, సెబీ చైర్‌పర్సన్‌ను బెంచ్ ఆదేశించింది.

అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై దర్యాప్తు కోరుతూ దాఖలైన నాలుగు పిటిషన్‌ల బ్యాచ్‌ను విచారించిన సుప్రీంకోర్టు గురువారం ప్యానెల్ ఏర్పాటుపై తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ పిటిషన్‌ను విచారిస్తున్న ధర్మాసనంలో సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేబీ పార్దీవాలా సభ్యులుగా ఉన్నారు.

మరిన్ని వార్తలు