Billionaire Gautam Adani's group: టెలికంలోకి అదానీ!

9 Jul, 2022 02:08 IST|Sakshi

స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు

న్యూఢిల్లీ: టెలికం రంగంలో దిగ్గజాలు అంబానీ, మిట్టల్‌ను ఢీకొనేందుకు అదానీ కూడా సిద్ధమవుతున్నారు. త్వరలో కేంద్రం నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనడం ద్వారా టెలికంలోకి ఎంట్రీ ఇవ్వాలని పారిశ్రామిక దిగ్గజం గౌతమ్‌ అదానీ గ్రూప్‌ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా స్పెక్ట్రం వేలానికి దరఖాస్తు కూడా చేసుకున్నట్లు పేర్కొన్నాయి.

స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువు శుక్రవారంతో ముగిసింది. దీనికి నాలుగు దరఖాస్తులు వచ్చాయి. జియో (ముకేష్‌ అంబానీ), ఎయిర్‌టెల్‌ (సునీల్‌ మిట్టల్‌), వొడాఫోన్‌ ఐడియాతో పాటు నాలుగో సంస్థగా అదానీ గ్రూప్‌ కూడా దరఖాస్తు చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. దరఖాస్తుదారుల పేర్లను జూలై 12న ప్రకటించనున్నారు. అదానీ గ్రూప్‌ ఇటీవలే నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ (ఎన్‌ఎల్‌డీ), ఇంటర్నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ (ఐఎల్‌డీ) లైసెన్సులు కూడా తీసుకుంది. వివిధ బ్యాండ్లలో దాదాపు రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే స్పెక్ట్రం వేలం జులై 26న ప్రారంభం కానుంది.

గుజరాత్‌కే చెందిన అంబానీ, అదానీ .. భారీ వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించినా ఇప్పటివరకూ ప్రత్యక్షంగా ఒకే రంగంలో పోటీ పడలేదు. అంబానీ ఆయిల్, పెట్రోకెమికల్స్, టెలికం, రిటైల్‌లో విస్తరించగా.. అదానీ మాత్రం పోర్టులు, బొగ్గు, ఏవియేషన్‌ వంటి రంగాలపై దృష్టి పెట్టారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం పరిస్థితి మారుతోంది. పెట్రోకెమికల్స్‌ విభాగంలోకి ప్రవేశించే దిశగా అదానీ ఇటీవలే ఒక అనుబంధ సంస్థ ఏర్పాటు చేశారు. పునరుత్పాదక విద్యుత్‌ విభాగంలో అంబానీ, అదానీ పోటాపోటీగా పెట్టుబడులు ప్రకటిస్తున్నారు.

మరిన్ని వార్తలు