‘గంగవరం’.. అదానీ పరం!

4 Mar, 2021 05:17 IST|Sakshi

పోర్టులో 31.5% వాటా కొనుగోలు

వార్‌బర్గ్‌ పింకస్‌తో అదానీ పోర్ట్స్‌ ఒప్పందం

డీల్‌ విలువ రూ. 1,954 కోట్లు

మెజారిటీ వాటా కోసం సన్నాహాలు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం పోర్ట్‌లో మెజారిటీ వాటాలు దక్కించుకోవడంపై అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం వార్‌బర్గ్‌ పింకస్‌కు పోర్టులో ఉన్న 31.5 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు రూ. 1,954 కోట్లు వెచ్చించనున్నట్లు అదానీ పోర్ట్స్‌ తాజాగా వెల్లడించింది. డీల్‌ ప్రకారం షేరు ఒక్కింటికి రూ. 120 ధర చొప్పున వార్‌బర్గ్‌ పింకస్‌కి ఉన్న మొత్తం 16.3 కోట్ల షేర్లను అదానీ పోర్ట్స్‌ కొనుగోలు చేయనుంది. అనుబంధ సంస్థ విండీ లేక్‌సైడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ద్వారా వార్‌బర్గ్‌ పింకస్‌కు గంగవరం పోర్టులో వాటాలు ఉన్నాయి.

ప్రమోటర్ల వాటాల కొనుగోలుకూ యత్నాలు
గంగవరం పోర్టులో ప్రమోటర్లు డీవీఎస్‌ రాజు, కుటుంబ సభ్యులకు 58.1%, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి 10.4% వాటాలు ఉన్నాయి. ప్రమో టర్ల వాటాలనూ కొనుగోలు చేయడం ద్వారా పోర్టులో మెజారిటీ వాటాలు దక్కించుకోవాలని అదానీ పోర్ట్స్‌ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ప్రమోటర్లతో చర్చలు కూడా జరుపుతోందని పేర్కొన్నాయి.  
పోర్టు ప్రత్యేకతలివీ..: గంగవరం పోర్టు సామర్థ్యం 64 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు (ఎంఎంటీ) కాగా.. 2059 వరకూ రాయితీలు  పొందేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నాయి. 2019–20లో 34.5 ఎంఎంటీ కార్గోను పోర్టు హ్యాండిల్‌ చేసింది. 2 లక్షల డీడబ్ల్యూటీ సామర్థ్యం కలిగిన నౌకలు (వెసల్స్‌) సైతం పోర్టులో రాకపోకలు సాగించే వీలుంది. 9 బెర్తులతో కార్యకలాపాలు సాగిస్తోం ది. కోల్, ముడిఇనుము, ఎరువులు, లైమ్‌స్టోన్, స్టీల్‌ తదితర పలు కమోడిటీలను హ్యాండిల్‌ చేయ గల సౌకర్యాలను కలిగి ఉంది. గతేడాది గంగవరం పోర్ట్‌ రూ. 1082 కోట్ల ఆదాయాన్ని సాధించింది. రూ. 516 కోట్ల నికర లాభం ఆర్జించింది. పోర్ట్‌ రుణరహితమే కాకుండా రూ. 500 కోట్ల నగదు నిల్వలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు