అదానీ పోర్ట్స్‌ లాభం ఫ్లాట్‌.. 30 శాతం పెరిగిన మొత్తం ఆదాయం

31 May, 2023 07:55 IST|Sakshi

న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌(ఏపీసెజ్‌) గత ఆర్థిక సంవత్సరం (2022–23) చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం 3 శాతం పుంజుకుని రూ. 1,141 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,112 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం మరింత అధికంగా 30 శాతం వృద్ధితో రూ. 6,179 కోట్లను అధిగమించింది. అంతక్రితం క్యూ4లో రూ. 4,739 కోట్ల టర్నోవర్‌ నమోదైంది.

అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 3,497 కోట్ల నుంచి రూ. 3,994 కోట్లకు పెరిగాయి. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 5 చొప్పున డివిడెండ్‌ ప్రకటించింది. పూర్తి ఏడాదికి సైతం మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఏపీసెజ్‌ దాదాపు 9 శాతం అధికంగా రూ. 5,393 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2021–22లో రూ. 4,953 కోట్ల లాభం నమోదైంది. ఫలితాల నేపథ్యంలో అదానీ పోర్ట్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.5 శాతం నీరసించి రూ. 734 వద్ద ముగిసింది. 

అదానీ ట్రాన్స్‌మిషన్‌ లాభం జూమ్‌ 
అదానీ ట్రాన్స్‌మిషన్‌ చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం 85 శాతం దూసుకెళ్లి రూ. 440 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 237 కోట్లు ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం సైతం రూ. 3,165 కోట్ల నుంచి రూ. 3,495 కోట్లకు ఎగసింది. నికర లాభాల్లో ట్రాన్స్‌మిషన్‌ విభాగం నుంచి 11 శాతం వృద్ధితో రూ. 221 కోట్లు లభించగా.. పంపిణీ విభాగం వాటా 478 శాతం జంప్‌చేసి రూ. 218 కోట్లకు చేరింది.

కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి అదానీ ట్రాన్స్‌మిషన్‌ నికర లాభం రూ. 1,281 కోట్లకు స్వల్పంగా బలపడింది. 2021–22లో రూ. 1,236 కోట్ల లాభం ప్రకటించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా రూ. 11,861 కోట్ల నుంచి రూ. 13,840 కోట్లకు జంప్‌ చేసింది.  ఫలితాల నేపథ్యంలో అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 3 శాతం పతనమై రూ. 810 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు