అదానీ పోర్ట్స్‌ లాభం డౌన్‌

26 May, 2022 06:35 IST|Sakshi

క్యూ4లో రూ. 1,033 కోట్లు

2021–22లో రూ. 4,795 కోట్లు

షేరుకి రూ. 5 డివిడెండ్‌

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ దిగ్గజం అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 22 శాతం క్షీణించి రూ. 1,033 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,321 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 4,072 కోట్ల నుంచి రూ. 4,418 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 2,527 కోట్ల నుంచి రూ. 3,309 కోట్లకు పెరిగాయి.

వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున డివిడెండు ప్రకటించింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 5 శాతం క్షీణించి రూ. 4,795 కోట్లకు పరిమితమైంది. 2020–21లో రూ. 5,049 కోట్లు ఆర్జించింది. మొత్తం టర్నోవర్‌ 27 శాతం జంప్‌చేసి రూ. 15,934 కోట్లకు చేరింది. గంగవరం పోర్టును మినహాయించిన ఫలితాలివి. కాగా.. కార్గో పరిమాణం 312 ఎంఎంటీను తాకినట్లు కంపెనీ సీఈవో కరణ్‌ అదానీ వెల్లడించారు. ఒక్క ముంద్రా పోర్ట్‌లోనే 150 ఎంఎంటీ కార్గోను చేపట్టినట్లు తెలియజేశారు. దేశీయంగా ఏ ఇతర పోర్టులోనూ ఈ స్థాయి కార్గో నమోదుకాలేదని వెల్లడించారు.  

లాజిస్టిక్స్‌ స్పీడ్‌
అనుబంధ సంస్థ అదానీ లాజిస్టిక్స్‌ 29 శాతం అధికంగా 4,03,737 టీఈయూ రైల్‌ కార్గోను సాధించినట్లు అదానీ పోర్ట్స్‌ పేర్కొంది. గతేడాది రూ. 11,400 కోట్ల పెట్టుబడులను చేపట్టినట్లు ప్రస్తావించింది. ముంబై, ఇండోర్, పలావ్ల్, రనోలీ, విరోచన్‌నగర్‌లలో నిర్మిస్తున్న వేర్‌హౌసింగ్‌ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) జనవరి–మార్చికల్లా మొత్తం 4 మిలియన్‌ చదరపు అడుగులు అందుబాటులోకి రానున్నట్లు వివరించింది.  

ఫలితాల నేపథ్యంలో అదానీ పోర్ట్స్‌ షేరు 5.6 శాతం పతనమై రూ. 710 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు