అదానీ పోర్టు సరికొత్త రికార్డులు..ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ పోర్టుగా

23 Mar, 2022 09:00 IST|Sakshi

దొండపర్తి (విశాఖ దక్షిణ): అదానీ పోర్టు సరికొత్త రికార్డును నమోదు చేసింది. కార్గో రవాణాలో 300 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల మైలురాయిని అధిగమించింది. అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌(ఏపీసెజ్‌)గా దేశ నౌకాశ్రయాల్లో రెండు దశాబ్దాల క్రితం కార్యకలాపాలను ప్రారంభించిన నాటి నుంచి గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తూ మార్కెట్‌ వాటాను పెంచుకుంటోంది. నిర్దిష్టమైన వ్యూహాలు, ప్రణాళికలతో కార్గో రవాణాలో వృద్ధిని నమోదు చేస్తుండడం అదానీ పోర్ట్స్‌ సామర్థ్యానికి నిదర్శనమని ఏపీసెజ్‌ సీఈఓ అండ్‌ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ కరణ్‌ అదానీ పేర్కొన్నారు. ఏటా 100 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు(పోర్ట్‌ఫోలియోలో 5 పోర్టులతో) సరకు రవాణా సాధించడానికి 14 ఏళ్లు పట్టిందని వెల్లడించారు.

ఏపీసెజ్‌ తరువాత ఐదేళ్లలో దానిని రెట్టింపు చేసి ఏటా 200 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు (పోర్ట్‌ఫోలియోలో 9 పోర్టులతో) కార్గోను రవాణా చేసినట్లు తెలిపారు. ఇపుడు ఏపీసెజ్‌ పోర్ట్‌ఫోలియోలో 12 పోర్టులతో మూడేళ్లలోనే ఏటా 300 మెట్రిక్‌ టన్నుల లక్ష్యాన్ని అధిగమించిందని వివరించారు. కరోనా సమయంలోను, ప్రపంచ ఆర్థిక రంగం మందగమనంలో ఉన్నప్పటికీ ఈ ఘనతను సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. భారత తీరప్రాంతంలోని పోర్టుల నెట్‌వర్క్‌తో పాటు ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్స్‌ సామర్థ్యాల పెంపుతో పాటు సాంకేతికతతో కూడిన డిజిటలైజ్డ్‌ కార్యకలాపాలపై దృష్టి సారించినట్లు తెలిపారు. 2025 నాటికి 500 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల లక్ష్యానికి చేరుకుంటామన్నారు. అలాగే 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ పోర్టు కంపెనీగా ఎదుగుతుందని చెప్పారు.   

అదానీ పవర్‌ పునర్వ్యవస్థీకరణ 
న్యూఢిల్లీ: పూర్తి అనుబంధ సంస్థలు ఆరింటిని విలీనం చేసుకునే పథకానికి బోర్డు ఆమోదముద్ర వేసినట్లు అదానీ పవర్‌ తాజాగా వెల్లడించింది. కంపెనీకి చెందిన విభిన్నతరహా సొంత అనుబంధ సంస్థలను విలీనం చేసుకోనున్నట్లు తెలియజేసింది. విలీనం చేసుకోనున్న సంస్థల జాబితాలో అదానీ పవర్‌ మహారాష్ట్ర, అదానీ పవర్‌ రాజస్తాన్, అదానీ పవర్‌ ముంద్రా, ఉడు పి పవర్‌ కార్పొరేషన్, రాయ్‌పూర్‌ ఎనర్జెన్, రాయ్‌గఢ్‌ ఎనర్జీ జనరేషన్‌ ఉన్నట్లు పేర్కొంది. ఈ పథకం అమలుకు 2021 అక్టోబర్‌ 1ను ఖరారు చేయగా.. ఆరు సంస్థల ఆస్తులు, అప్పులు అదానీ పవర్‌కు బదిలీకానున్నట్లు వివరించింది.      

మరిన్ని వార్తలు