అదానీ పోర్ట్‌ ఆదాయం పైపైకి, జంప్‌ చేసిన నికర లాభం

4 Aug, 2021 08:06 IST|Sakshi

న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాల దిగ్గజం అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో నికర లాభం 77 శాతం జంప్‌చేసి రూ. 1,342 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 758 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,749 కోట్ల నుంచి రూ. 4,938 కోట్లకు పురోగమించింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 1,805 కోట్ల నుంచి రూ. 3,465 కోట్లకు ఎగశాయి.  

పోర్టులపై దృష్టి.. 
ఏపీ సెజ్‌ గ్రూప్‌తో గంగవరం పోర్టు(జీపీఎల్‌) విలీనం తదితర కన్సాలిడేషన్‌ చర్యలు చేపట్టేందుకు వీలుగా స్వతంత్ర డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేసినట్లు అదానీ పోర్ట్స్‌ తాజాగా వెల్లడించింది. జీపీఎల్‌లో ఏపీ ప్రభుత్వ వాటా 10.4 శాతం విక్రయం తదుపరి ఈ చర్యలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలియజేసింది. ఇక కృష్ణపట్నం పోర్టులో మిగిలిన 25 శాతం వాటాను రూ. 2,800 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలియజేసింది. తద్వారా కృష్ణపట్నం పోర్టు పూర్తి అనుబంధ సంస్థగా ఆవిర్భవించినట్లు పేర్కొంది.  ఫలితాల నేపథ్యంలో అదానీ పోర్ట్స్‌ షేరు 2.2 శాతం బలపడి రూ. 707 వద్ద ముగిసింది.

అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ లాభం రూ.265 కోట్లు 
న్యూఢిల్లీ: అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ (ఏఈఎల్‌) జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి  రూ.12,579 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయంపై రూ.265 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో ఆదాయం రూ.5,265 కోట్లు, నికర నష్టం రూ.66 కోట్లుగా ఉంది. ‘ఏఈఎల్‌ ఎప్పుడూ అదానీ గ్రూపునకు కొత్త కంపెనీల అంకురార్పణ కేంద్రంగా కొనసాగుతుంది.  ఆత్మనిర్భర్‌ భారత్‌ను బలోపేతం చేసే కీలక వ్యాపారాల్లో విజయవంతంగా ప్రవేశించాము. వీటిల్లో ఎయిర్‌పోర్టులు, డేటా కేంద్రాలు, రహదారులు, నీటి వసతులు ఉన్నాయి’ అని అదానీ గ్రూపు చైర్మన్‌ గౌతమ్‌ అదానీ సంస్థ భవిష్యత్తుపై స్పష్టతనిచ్చారు. 

మరిన్ని వార్తలు