అదానీ పవర్‌ లాభాలు అదిరెన్‌

12 Nov, 2022 08:47 IST|Sakshi

న్యూఢిల్లీ: అదానీ పవర్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.231 కోట్లతో పోలిస్తే రెట్టింపునకు పైగా పెరిగి రూ.696 కోట్లకు చేరింది. ఆదాయం సైతం 52 శాతం వృద్ధితో రూ.8,446 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి ఆదాయం రూ.5,572 కోట్లుగా ఉండడం గమనార్హం. 

ఆలస్యపు రుసం సర్‌చార్జీ రూపంలో రూ.912 కోట్ల మొత్తం ఆదాయానికి వచ్చి కలసినట్టు అదానీ పవర్‌ తెలిపింది. అలాగే, దిగుమతి చేసుకున్న బొగ్గు ధరలు అధికంగా ఉండడం, డిమాండ్‌ పెరగడం వల్ల దీర్ఘకాల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏలు) టారిఫ్‌లు మెరుగుపడడం సానుకూలించినట్టు పేర్కొంది. 

సంప్రదాయ ఇంధన ఆధారిత విద్యుత్‌ ఇప్పటికీ దేశ స్థిరమైన విద్యుత్‌ డిమాండ్‌ను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు అదానీ పవర్‌ పేర్కొంది. తద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న దేశ ప్రతిష్టాత్మక లక్ష్యాలకు అనుగుణంగా సంప్రదాయేతర ఇంధన వనరులపై మరిన్ని పెట్టుబడులకు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపింది. ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ 39.2 శాతంగా, విద్యుత్‌ విక్రయాలు 11 బిలియన్‌ యూనిట్లుగా ఉన్నాయి.    

మరిన్ని వార్తలు