దేశంలో అదానీ - హిండెన్‌బర్గ్‌ ప్రకంపనలు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

10 Feb, 2023 18:41 IST|Sakshi

అదానీ గ్రూప్‌పై హిండెన్‌ బర్గ్‌ చేసిన ఆరోపణలతో స్టాక్‌ మార్కెట్‌లోని పెట్టు బడిదారులు తీవ్రంగా నష్ట పోయారు. అదానీ గ్రూపు ఆర్థిక అవకతవకలపై చర్చించాలని ప్రతిపక్షాలు ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టాయి. ఆదానీ ప్రకంపనలు ఇంకా పార్లమెంట్‌లో కొనసాగుతున్నాయి.

చివరికి ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అదానీ - హిండెన్‌ బర్గ్‌ వివాదంపై జోక్యం చేసుకోవాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సీజేఐ చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌. నరసింహ, జస్టిస్‌ జేబీ. పార్థివాలాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇన్వెస్టర్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన  సుప్రీంకోర్టు.. నిపుణలతో కమిటీ వేస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. 

హిండెన్‌బర్గ్‌ నివేదిక వివాదంపై సెబీ, కేంద్రం అభిప్రాయం కోరింది. అదానీ గ్రూప్‌పై వస్తున్న ఆరోపణలను పరిశీలించాలని, జడ్జీతో కూడిన నిపుణులైన ప్యానల్‌ బృందాన్ని ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. అదానీ అంశంలో కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే వివాదంలోని ప్రస్తుత పరిస్థితులు, పరిశీలన కోసం నిపుణుల కమిటీని ఏర్పాటుకు సూచించామని సీజేఐ చెప్పారు. ఆ కమిటీలో న్యాయమూర్తి, సంబంధిత నిపుణులను చేర్చవలసిందిగా తెలిపారు.

రెగ్యులేటరీ ప్రక్రియపై ఆందోళన, గత రెండు వారాల్లో జరిగిన ఈ సంఘటనతో దేశ పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపేందుకు కృషి చేయాలని సొలిసిటర్ జనరల్‌కు సూచించినట్లు పేర్కొన్నారు. తదుపరి విచారణను ఫిబ్రవరి13కు వాయిదా వేసింది.

చదవండి👉 మూన్‌లైటింగ్‌పై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు