క్యూ2లో అదానీ గ్యాస్‌కు షాక్‌!

4 Nov, 2022 08:51 IST|Sakshi

రూ. 139 కోట్లు   లాభం డౌన్‌

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ప్రయివేట్‌ రంగ కంపెనీ అదానీ టోటల్‌ గ్యాస్‌ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై-సెప్టెంబర్‌(క్యూ2)లో నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 139 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 159 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 73 శాతం జంప్‌చేసి రూ. 1,190 కోట్లను తాకింది.

సీఎన్‌జీకి డిమాండ్‌ పుంజుకోవడంతో గ్యాస్‌ విక్రయాలు 9 శాతం వృద్ధితో 19.1 కోట్ల ఘనపు మీటర్లను తాకాయి. ఈ కాలంలో నేచురల్‌ గ్యాస్‌ వ్యయాలు రెట్టింపై రూ. 860 కోట్లకు చేరినట్లు కంపెనీ సీఈవో సురేష్‌ పి.మంగ్లానీ పేర్కొన్నారు. సహజవాయువు సీఎన్‌జీగా మార్పిడి ద్వారా ఆటో మొబైల్స్‌కు, పైప్‌డ్‌ నేచురల్‌ గ్యాస్‌గా మార్చి వంటలు, పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేసే సంగతి తెలిసిందే.

సెప్టెంబర్‌ చివరికల్లా 33 కొత్త సీఎన్‌జీ స్టేషన్లను జత చేసుకుంది. వీటి సంఖ్య 367కు చేరింది. ఇదే విధంగా 61,000 గృహాలకు కొత్త కనెక్షన్ల ద్వారా పీఎన్‌జీ నెట్‌వర్క్‌ను 6.25 లక్షలకు పెంచుకుంది. కొత్తగా 412 బిజినెస్‌ కస్టమర్లను కలుపుకుని వాణిజ్య కనెక్షన్ల సంఖ్యను 6,088కు చేర్చుకుంది.  ఫలితాల నేపథ్యంలో అదానీ టోటల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో స్వల్ప లాభంతో రూ. 3,647 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు