టోటల్‌ఎనర్జీస్‌తో అదానీ జట్టు 

15 Jun, 2022 02:23 IST|Sakshi

గ్రీన్‌ హైడ్రోజన్‌ వెంచర్‌ ఏర్పాటుకు రెడీ 

న్యూఢిల్లీ: బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ గ్రూప్‌ తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ఎనర్జీస్‌తో చేతులు కలిపింది. తద్వారా గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తికి వెంచర్‌ను ఏర్పాటు చేయనుంది. దీంతో అదానీ గ్రూప్‌ కర్బనరహిత ఇంధన తయారీని చేపట్టనుంది. రానున్న దశాబ్ద కాలంలో ఈ రంగంలో అనుబంధ విభాగాలతో కలిపి 50 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలున్నట్లు అదానీ గ్రూప్‌ పేర్కొంది. 

అదానీ గ్రూప్‌ కొత్త ఇంధన బిజినెస్‌ విభాగం అదానీ న్యూ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌(ఏఎన్‌ఐఎల్‌)లో టోటల్‌ఎనర్జీస్‌ 25 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. అయితే డీల్‌ విలువను రెండు సంస్థలూ వెల్లడించకపోవడం గమనార్హం. ఏఎన్‌ఐఎల్‌లో 25 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు టోటల్‌ఎనర్జీస్‌ ప్రకటించింది.

2030కల్లా ఏఎన్‌ఐఎల్‌ వార్షికంగా మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల(ఎంటీపీఏ) గ్రీన్‌ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టోటల్‌ఎనర్జీస్‌ పేర్కొంది. తొలి మైలురాయికింద 30 గిగావాట్ల కొత్త పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుకునే ప్రణాళికలున్నట్లు తెలియజేసింది. ఈ జనవరిలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్ట్స్‌ కోసం అదానీ గ్రూప్‌ ఏఎన్‌ఐఎల్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  

దశాబ్ద కాలంలో.. 
నూతన ఇంధన విభాగంలో రానున్న 10 ఏళ్ల కాలంలో 70 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు అదానీ గ్రూప్‌ గతేడాది నవంబర్‌లో ప్రకటించింది. దీనిలో భాగంగా 2022–23కల్లా అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌(ఏజీఈఎల్‌) ఏడాదికి 2 గిగావాట్ల సోలార్‌ మాడ్యూల్‌ తయారీ సామర్థ్యాన్ని నెలకొల్పే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు 20 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను వెచ్చిస్తోంది. కాగా.. టోటల్‌ ఎనర్జీస్‌ ఇప్పటికే అదానీ గ్రీన్‌ ఎనర్జీతో జట్టు కట్టింది. 

మరిన్ని వార్తలు