అదానీ ట్రాన్స్‌మిషన్‌: 32 శాతం లాభాలు ఢమాల్‌

3 Nov, 2022 15:59 IST|Sakshi

 క్యూ2లో రూ. 194 కోట్లు  

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో విద్యుత్‌ రంగ దిగ్గజం అదానీ ట్రాన్స్‌మిషన్‌ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో నికర లాభం 32 శాతం క్షీణించి రూ. 194 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021-22) ఇదే కాలంలో దాదాపు రూ. 289 కోట్లు ఆర్జించింది. అయితే రూ. 138 కోట్ల ఫారెక్స్‌ నష్టాలు(విదేశీ రుణాలపై ఎంటూఎం సర్దుబాటు) ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది.

గత క్యూ2లో ఇవి రూ. 6 కోట్ల లాభంగా నమోదైనందున ఫలితాలు పోల్చిచూడతగదని వివరించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 2,675 కోట్ల నుంచి రూ. 3,377 కోట్లకు బలపడింది. ఈ కాలంలో 223.3 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను విక్రయించింది. గత క్యూ2లో 197.5 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే విక్రయించింది. మార్పిడి రహిత డిబెంచర్ల(ఎన్‌సీడీలు) జారీ ద్వారా రూ. 1,500 కోట్లు సమీకరించేందుకు బోర్డు అనుమతించింది. నేటి(2) నుంచి ట్రాన్స్‌మిషన్‌ బిజినెస్‌కు సీఈవోగా విమల్‌ దయాల్, పంపిణీ విభాగ సీఈవోగా కందర్ప్‌ పటేల్‌ను బోర్డు ఎంపిక చేసింది. అనిల్‌ సర్దానా కంపెనీ ఎండీగా బాధ్యతలు కొనసాగించనున్నారు.  
 

మరిన్ని వార్తలు