బ్రాండెడ్‌ బియ్యంపై అదానీ విల్మర్‌ దృష్టి

24 Mar, 2022 06:31 IST|Sakshi

ప్రాసెసింగ్‌ యూనిట్లు, బ్రాండ్స్‌ కొనుగోలు యోచన

రూ. 500 కోట్ల వరకూ పెట్టుబడులు

సంస్థ ఎండీ మాలిక్‌ వెల్లడి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ బియ్యం బ్రాండ్లు, ప్రాసెసింగ్‌ యూనిట్లను కొనుగోలు చేయడంపై కమోడిటీ దిగ్గజం అదానీ విల్మర్‌ దృష్టి పెట్టింది. ఇందుకోసం దాదాపు రూ. 450–500 కోట్లు వెచ్చించనుంది. కంపెనీ ఎండీ, సీఈవో అంగ్షు మాలిక్‌ ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం బాస్మతి బియ్యానికే పరిమితమైన అదానీ విల్మర్‌.. ఏప్రిల్‌ నుండి ఫార్చూన్‌ బ్రాండ్‌ కింద రోజువారీ వినియోగించే రైస్‌ను మార్కెట్లో ప్రవేశపెడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘ఈ విభాగంలో వేగంగా వృద్ధి చెందాలని నిర్దేశించుకున్నాం.

ఇందుకోసం బ్రాండ్‌లు, రైస్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు కొనుగోలు చేసేందుకు అన్వేషిస్తున్నాం. ముందుగా పశ్చిమ బెంగాల్‌లో ఖాయిలా పడిన యూనిట్‌ను తీసుకున్నాం. సాధారణంగా ప్రాథమిక స్థాయి నుంచి మొదలుపెడితే కార్యకలాపాలను ప్రారంభించేందుకు కనీసం రెండేళ్లయినా పట్టేస్తుంది. అదే నేరుగా యూనిట్లు, బ్రాండ్‌లను కొనుగోలు చేస్తే వేగవంతంగా కార్యకలాపాలు విస్తరించవచ్చు, వృద్ధి సాధించవచ్చు‘ అని ఆయన చెప్పారు. ప్రాంతాలవారీగా ప్రాచుర్యంలో ఉన్న బియ్యాన్ని విక్రయిస్తామని మాలిక్‌ వివరించారు.

మరిన్ని వార్తలు