Adar Poonawalla: ఆ విద్యార్థులకు సీరం ఆర్థిక సాయం

6 Aug, 2021 07:43 IST|Sakshi
సీరం సీఈఓ అదార్‌ పూనావాలా(ఫైల్‌ ఫోటో)

విదేశాలకు వెళ్తున్న విద్యార్థులకు రూ.10 కోట్ల సాయం

‘క్వారంటైన్‌’ ఖర్చుల భారం  తీర్చనున్న సీరమ్‌ సీఈవో

న్యూఢిల్లీ: విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థులకు రూ.10 కోట్ల ఆర్థికసాయం చేయనున్నట్లు వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో, సంస్థ అధిపతి అదార్‌ పూనావాలా గురువారం ప్రకటించారు. ఇక్కడి నుంచి వెళ్లే భారతీయ విద్యార్థులు కొన్ని దేశాల్లో అక్కడికెళ్లాక క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితులున్నాయి. క్వారంటైన్‌లో భాగంగా వసతి, భోజనం తదితర ఖర్చులు విద్యార్థులే భరించాలి. వీరికి ఆర్థికసాయం చేసే నిమిత్తం రూ.10 కోట్లు కేటాయించినట్లు పూనావాలా చెప్పారు.

ఆర్థికసాయం కోరే విద్యార్థులు ఈ లింక్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పూనావాలా గురువారం తన ట్విట్టర్‌ ఖాతాలో ఒక ట్వీట్‌ చేశారు. భారత్‌లో కోవిషీల్డ్‌ కోవిడ్‌ టీకా తీసుకున్న విద్యార్థులు తమ దేశంలో క్వారంటైన్‌లో ఉండాల్సిన పనిలేదని 16 యూరోపియన్‌ దేశాలు జూలైలో ప్రకటించాయి. కానీ, ఇంకొన్ని దేశాలు క్వారంటైన్‌ కాలం పూర్తయ్యాకే దేశ భూభాగంలోకి అనుమతిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థికసాయానికి పూనావాలా ముందుకొచ్చారు.  

మరిన్ని వార్తలు