DRHP: ఎల్‌ఐసీకి ఐడీబీఐ బ్యాంక్‌ షాక్‌! 

16 Feb, 2022 08:42 IST|Sakshi

బ్యాంకులో మరిన్నిపెట్టుబడులతో సవాళ్లు 

కంపెనీ ఆర్థిక పరిస్థితులను దెబ్బతీయవచ్చు 

ఐపీవో ప్రాస్పెక్టస్‌లో పేర్కొన్న ఎల్‌ఐసీ

న్యూఢిల్లీ: రెండేళ్ల క్రితం మెజారిటీ వాటా దక్కించుకున్న ఐడీబీఐ బ్యాంకులో అదనపు పెట్టుబడులు చేపట్టవలసివస్తే కంపెనీ ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం పడే వీలున్నట్లు బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీ తాజాగా పేర్కొంది. పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు అనువుగా కంపెనీ ఇటీవల సెబీకి దాఖలు చేసిన ముసాయిదా పత్రాల(ప్రాస్పెక్టస్‌)లో ఇంకా పలు అంశాలను ప్రస్తావించింది. డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూని చేపట్టనున్న సంగతి తెలిసిందే. తద్వారా సుమారు రూ. 63,000 కోట్లు సమీరించే యోచనలో ఉంది. కాగా.. ప్రాస్పెక్టస్‌లో ఎల్‌ఐసీ దాఖలు చేసిన వివరాల ప్రకారం.. 

2019లో.. 
అర్హతగల సంస్థలకు షేర్ల జారీ(క్విప్‌) ద్వారా ఐడీబీఐ బ్యాంకులో 2019 అక్టోబర్‌ 23న ఎల్‌ఐసీ రూ. 4,743 కోట్లను ఇన్వెస్ట్‌ చేసింది. ఆపై 2020 డిసెంబర్‌ 19న క్విప్‌లో భాగంగా మరో రూ. 1,435 కోట్లు అందించింది. 2021 మార్చి10 నుంచి ఆర్‌బీఐ నిర్దేశించిన దిద్దుబాటు చర్యల(పీసీఏ) నుంచి బ్యాంకు బయటపడినట్లు ఎల్‌ఐసీ పేర్కొంది. బ్యాంకు ఆర్థిక పరిస్థితులు, నిర్వహణా ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం పెట్టుబడుల సమీకరణ ఆవశ్యకత కనిపించడం లేదని తెలియజేసింది. అయితే ఐదేళ్ల కాలపరిమితి ముగిశాక అదనపు మూలధనం అవసరపడితే.. బ్యాంకు నిధులను సమకూర్చుకోలేకపోతే మరిన్ని పెట్టుబడులు చేపట్టవలసి రావచ్చునని వివరించింది. దీంతో కంపెనీ ఆర్థిక పరిస్థితులతోపాటు.. నిర్వహణా ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడవచ్చని ఎల్‌ఐసీ అభిప్రాయపడింది. 2023 నవంబర్‌కల్లా ఐదేళ్ల గడువు ముగియనుంది.  

సహచర సంస్థగా..  
ఐడీబీఐ బ్యాంకు 2019 జనవరి 21న ఎల్‌ఐసీకి అనుబంధ సంస్థగా మారింది. దాదాపు 83 కోట్ల ఈక్విటీ షేర్ల అదనపు కొనుగోలు ద్వారా ఎల్‌ఐసీ వాటా 51 శాతానికి చేరింది. తదుపరి 2020 డిసెంబర్‌ 19న బ్యాంకును సహచర సంస్థగా మార్పు(రీక్లాసిఫై) చేశారు. బ్యాంకు చేపట్టిన క్విప్‌ నేపథ్యంలో ఎల్‌ఐసీ వాటా 49.24 శాతానికి చేరడం ఇందుకు కారణమైంది. మరోపక్క ఆర్‌బీఐ అనుమతించిన గడువు నుంచి ఐదేళ్లలోగా సహచర సంస్థలు ఐడీబీఐ బ్యాంకు లేదా ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో ఒకటి గృహ రుణ కార్యకలాపాలకు చెక్‌ పెట్టవలసి ఉన్నట్లు ఆర్‌బీఐ నిర్దేశించిన విషయాన్ని ప్రస్తావించింది. దీంతో కంపెనీ ఆర్థిక పరిస్థితులు, ఫలితాలు, క్యాష్‌ ఫ్లోపై ప్రభావం పడే అవకాశమున్నట్లు తెలియజేసింది. 

చదవండి: ఎల్‌ఐసీ పాలసీదారులకు అలర్ట్‌..! అందులో పాల్గోనాలంటే కచ్చితంగా..

మరిన్ని వార్తలు