ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ లాభం ఐదింతలు

5 Nov, 2022 14:45 IST|Sakshi

సెప్టెంబర్‌ క్వార్టర్‌కు రూ.29 కోట్లు  

న్యూఢిల్లీ: పండుగల సీజన్‌ కావడంతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ సెప్టెంబర్‌ క్వార్టర్‌లో మెరుగైన పనితీరు చూపించింది. కన్సాలిడేటెడ్‌ లాభం ఐదింతలు పెరిగి రూ.29 కోట్లకు చేరింది. ఆదాయం సైతం 50 శాతం పెరిగి రూ.3,075 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.5 కోట్లు, ఆదాయం రూ.2,054 కోట్ల చొప్పున ఉన్నాయి.

‘‘కంపెనీ చరిత్రలో ఒక త్రైమాసికంలో అత్యధిక ఆదాయాన్ని నమోదు చేశాం. ఈ కామర్స్‌ విక్రయాల్లో మెరుగైన పనితీరు వృద్ధికి సాయపడింది. మార్కెటింగ్‌పైనా పెట్టుబడులు పెరిగాయి. బ్రాండ్ల బలోపేతం, వినియోగదారులను చేరుకోవడంపై దృష్టి సారించాం. పెద్ద ఎత్తున స్టోర్ల నెట్‌వర్క్‌ విస్తరణ చేపట్టాం. పాంటలూన్‌ బ్రాండ్‌ కింద 21 స్టోర్లు, బ్రాండెడ్‌ వ్యాపారంలో 85 స్టోర్లు ప్రారంభించాం’’ అని ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ తెలిపింది. 

విభాగాల వారీగా..   
♦ మధుర ఫ్యాషన్‌ అండ్‌ లైఫ్‌ స్టయిల్‌ విభాగం ఆదాయం 45 శాతం పెరిగి రూ.2,109 కోట్లుగా  ఉంది.
♦ ప్యాంటలూన్స్‌ ఆదాయం 65 శాతం పెరిగి రూ.1,094 కోట్లకు చేరింది. 
ఈ కామర్స్‌ విక్రయాలు 20 శాతం పెరిగాయి. ఎబిట్టా మార్జిన్లు కరోనా ముందున్న స్థాయిని అధిగమించాయి.  
♦ కంపెనీ కన్సాలిడేటెడ్‌ రుణ భారం రూ.243 కోట్లకు తగ్గింది.  

మరిన్ని వార్తలు