స్ట్రైడ్స్‌కు సలహాదారుగా ఆదిత్య పురీ

8 Jan, 2021 11:19 IST|Sakshi

ఫార్మా కంపెనీ స్ట్రైడ్స్‌ గ్రూప్‌ బోర్డులో చేరిక

అడ్వయిజర్‌, డైరెక్టర్‌గా సేవలందించేందుకు రెడీ

గతంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీగా పనిచేసిన పురీ

ఇంట్రాడేలో సరికొత్త గరిష్టాన్ని తాకిన స్ట్రైడ్స్‌ ఫార్మాసైన్స్‌ షేరు

న్యూఢిల్లీ, సాక్షి: ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు విశేష సేవలందించిన ఆదిత్య పురీ తాజాగా ఫార్మా కంపెనీ స్డ్రైడ్స్‌ గ్రూప్‌లో చేరారు. తద్వారా స్ట్రైడ్స్‌ గ్రూప్‌నకు సలహాదారుగా సేవలిందించనున్నారు. అంతేకాకుండా సహచర కంపెనీ స్టెలిస్‌ బయోఫార్మా బోర్డులో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. గ్రూప్‌నకు సలహదాదారుగా సేవలందించేందుకు సుప్రసిద్ధ కార్పొరేట్‌ దిగ్గజం ఆదిత్య పురీ సంస్థలో చేరినట్లు స్ట్రైడ్స్‌ నియంత్రణ సంస్థలకు తెలియజేసింది. అంతేకాకుండా సహచర కంపెనీ స్టెలిస్‌ బయోఫార్మాలో డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు వెల్లడించింది. (పురీ వేవ్‌- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రికార్డ్స్‌)

ట్రాన్సిషన్‌ దశలో
కంపెనీ ప్రాథమిక దశ నుంచి కన్సాలిడేషన్‌, వృద్ధి దశకు చేరుకుంటున్న సందర్భంలో పురీ చేరిక గ్రూప్‌నకు మరింత ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్‌ పేర్కొంది. అంతర్జాతీయ కంపెనీలు అందుబాటు ధరల్లో ప్రపంచ స్థాయి చికిత్సలను అందించడంలో భాగస్వామిగా సేవలందించే దిశలో కంపెనీ సాగుతున్నట్లు తెలియజేసింది. తద్వారా వర్ధమాన, అభివృద్ధి చెందిన మార్కెట్లలో విస్తరించనున్నట్లు వివరించింది. ఇప్పటికే గ్లోబల్‌ స్థాయిలో పట్టుసాధించిన స్ట్రైడ్స్‌ గ్రూప్‌తోపాటు, స్టెలిస్‌ బయోఫార్మా మరింత వృద్ధి సాధించేందుకు వీలుగా సేవలందించనున్నట్లు పురీ పేర్కొన్నారు. గ్రూప్‌ సలహాదారుగా, స్టెలిస్‌ బోర్డు డైరెక్టర్‌గా సేవలందించనున్న ఆదిత్య పురీకి స్వాగతం పలుకుతున్నట్లు స్ట్రైడ్స్‌ వ్యవస్థాపక చైర్మన్ అరుణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. పురీ రాకతో గ్రూప్‌పట్ల నమ్మకం మరింత బలపడనున్నట్లు చెప్పారు. పురీ అనుభవం గ్రూప్‌నకు ఎన్నో విధాల ఉపయోగపడనున్నట్లు పేర్కొన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ప్రారంభం నుంచీ ఆదిత్య పురీ 25 ఏళ్లపాటు సేవలందించిన విషయం విదితమే. పురీ హయాంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రయివేట్‌ రంగంలో టాప్‌ ర్యాంకుకు చేరుకుంది. (హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు కొత్త చైర్మన్‌!)

షేరు రికార్డ్‌
ఆదిత్య పురీ బోర్డులో చేరుతున్న వార్తలతో స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ ఏర్పడింది. ఎన్‌ఎస్‌ఈలో స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌ షేరు తొలుత 2.6 శాతం ఎగసి రూ. 999ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. తదుపరిలాభాల స్వీకరణతో వెనుకంజ వేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం 3 శాతం క్షీణించి రూ. 945 దిగువన ట్రేడవుతోంది. 2020 మార్చి 20న ఈ షేరు రూ. 268 వద్ద 52 వారాల కనిష్టానికి చేరింది. గత ఆరు నెలల్లో ఈ షేరు 130 శాతం ర్యాలీ చేయడం గమనార్హం!

మరిన్ని వార్తలు